రవీంద్రభారతి, నవంబర్ 19: 42% బీసీ రిజర్వేషన్ల హామీ నెరవేర్చకుండా పాత రిజర్వేషన్ల విధానంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్చేసింది. లేకుంటే డిసెంబర్ 9 నుంచి తిరుగుబాటు మహాసభల ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమం చేపడుతామని హెచ్చరించింది.
ఇందులో భాగంగా డిసెంబర్ 9న నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో 20వేల మందితో మహాసభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటిదారి పట్టిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రకటించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో బీసీ నేతలతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పుతున్నదని, కేంద్ర రెడ్డి, రాష్ట్ర రెడ్డి అవగాహనతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి దీనికి తగ్గ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. డిసెంబర్ 9 నుంచి తిరుగుబాటు మహాసభల ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమం చేపడుతామని వెల్లడించారు. సమావేశంలో అడ్వకేట్ జేఏసీ నేత నాగుల శ్రీనివాస్‌యాదవ్, ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు.