హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఇంటిజాగ ఉండి పూరి గుడిసెలు, కచ్చ ఇండ్లు ఉన్నవారికే తొలి విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వికలాంగులు, వితంతువులు, తదితర నిరుపేదలకు మాత్రమే తొలి విడతలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం గృహనిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బ్రాండింగ్ వేసేందుకు తమకు ఎటువంటి భేషజాలు లేవని తెలిపారు.
కేంద్రం యాప్ ద్వారా ఎంపికకాని నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇండ్ల మంజూరుకోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, శాస్త్రీయ పద్ధతుల్లో, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు 32 లక్షల దరఖాస్తుదారుల వివరాలను సేకరించగా, తొలివిడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే ఏడాది జనవరి మొదటి వారంకల్లా మొత్తం 80 లక్షలమంది దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తామని, ఇప్పటికే జిల్లాల వారీగా ప్రాజక్టు డైరెక్టర్లను నియమించామని వివరించారు. ఎంపికైనవారికి నాలుగు విడతల్లో రూ.5 లక్షలను చెల్లిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ఫిర్యాదుల స్వీకరణకు ఒకటి రెండు రోజుల్లో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని, త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా పూర్తిచేస్తామని చెప్పారు. ఇల్లు పొం దేందుకు రేషన్‌కార్డుతో పనిలేదని, యాప్‌లో నమోదుచేసిన వివరాలు, గ్రామసభల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.
నగరానికి నలువైపులా సుమారు 100 ఎకరాలకు తగ్గకుండా భూములను గుర్తించి అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు కూడా ఇండ్లు నిర్మించే యోచన ఉన్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో మాదిరిగా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ గృహాలను నిర్మిస్తామని చెప్పారు. దిల్ (డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల బకాయి చెల్లించకపోతే ఆ ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం నిర్వహిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ అధికారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నామని, త్వరలో 1,200 మంది వరకు సర్వేయర్లను కూడా నియమిస్తామని మంత్రి ప్రకటించారు.
రాజీవ్ స్వగృహ ఇండ్లను జర్నలిస్టులకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. మిగిలిన ఇండ్లను వేలం వేసేందుకు హౌసింగ్ బోర్డు ప్రయత్నిస్తున్నదని, వాటిని జర్నలిస్టులకు కేటాయించాలని కొందరి కోరిక మేరకు మంత్రి స్పందించారు. ధరను నిర్ధారించి కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.