Siddipet | సిద్దిపేట, ఫిబ్రవరి 21: సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం 6.58 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు పెద్ద శబ్దంతో పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం కారణంగా సిద్దిపేట, దుబ్బాక సహా పరిసర గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారంగా మారింది.
రేపటి వరకు కూడా విద్యుత్తు పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. విద్యుత్తు ట్రిప్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి గల పూర్తికారణాలపై ఆరా తీస్తున్నట్టు విద్యుత్తు అధికారి శ్రీనివాస్ తెలిపారు. మునిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్ల ద్వారా కోమటిచెరువు నుంచి నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. విద్యుత్తు డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతోనే లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినట్టు భావిస్తున్నారు.
ముస్తాబాద్ చౌరస్తాలో 220 కేవీ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు విద్యుత్తు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
మంటలు అదుపులోకి రాకపోవడంతో గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల నుంచి మరిన్ని ఫైర్ ఇంజిన్లను తెప్పించి త్వరగా మంటలు అదుపులోకి తెచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మూడు గంటలపాటు ఎగసిపడిన మంటలు ఎట్టకేలకు రాత్రి 10 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. హరీశ్‌రావు దాదాపు రెండుగంటలపాటు ఘటనా స్థలంలోనే ఉండి అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదస్థలికి సిద్దిపేట సీపీ అనురాధ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు చేరుకున్నారు.
విద్యుత్తు సబ్‌స్టేషన్ ప్రమాదంపై లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలిసి సిద్దిపేటకు వస్తూనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. విద్యుత్తుశాఖ డైరెక్టర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులను వెంటనే పంపాలని కోరినట్టు చెప్పారు. విద్యుత్తుశాఖ కార్యదర్శి రిజ్వీతో కూడా ఫోన్లో మాట్లాడినట్టు పేర్కొన్నారు. విద్యుత్తు, అగ్నిమాపకశాఖ అధికారుల ప్రత్యేక కృషితో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని, విద్యుత్తు సరఫరాను వేగంగా పునరుద్ధరించాలని కోరారు.