Rangareddy | హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న స్పెషల్ రైలు బోగీల కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి రైలులో మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బ్రేక్ జామ్ అవడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత రైలు తిరిగి బెళగావికి బయలుదేరి వెళ్లింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.