వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్నవారిని దట్టమైన పొగరూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ మొదటి అంతస్తులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాతపడటం రాష్ట్రంలో పెను విషాదం నింపింది. షార్ట్ సర్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్టు తెలుస్తుండగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు చనిపోగా, దవాఖానలో 14 మంది మృత్యువాతపడ్డారు. ఒకే కుటుంబంలో మూడు తరాలవారు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.
Hyderabad | హైదరాబాద్/సిటీ బ్యూరో/చార్మినార్ మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ జరగని ఘోరం జరిగింది. చార్మినార్ చెంత ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మనసు కలిచివేసే ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చార్మినార్‌కు అతి సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీ ప్లస్ 2 భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎకువ మంది బెంగాల్‌కు చెందిన వారే. నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. అందరూ దగ్గరి బంధువులే. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి షాపుల్లో పనిచేస్తున్నారు. వీరు షాపుల్లో పనిచేస్తూనే పైన అంతస్తులో నివాసముంటున్నారు. వేసవి సెలవుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన బంధువులు సైతం ప్రమాదంలో మృతి చెందడం మరింత విషాదాన్ని నింపింది.
భవనంలో షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవి కమర్షియల్ కాంప్లెక్స్‌లు అయినా నివాసానికి వినియోగించుకుంటున్నారు. ఒక్కో గదిలో 6-8 మంది వరకు ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన స్థలంలో గ్యాస్ సిలిండర్, ఏసీ కంప్రెషర్ పేలడం వల్ల తీవ్రత మరింత పెరిగిందని ఫైర్ సిబ్బంది చెప్పారు. ఉదయం 6.16 గంటలకు ఫైర్ కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన అగ్పిమాపకశాఖ మొఘల్‌పుర నుంచి 6:20కి వాటర్ టెండర్ అక్కడికి చేరుకుంది. పరిస్థితి గమనించి తీవ్రంగా ఉన్నదని చెప్పడంతో మొత్తం 11 ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పాత భవనం కావడం, ఇరుగ్గా ఉండటం, మొదటి అంతస్తులో ప్రమాదం జరగడంతో రెస్యూ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పొగ కమ్మేయడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి పలువురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రెండో ఫ్లోర్లో ఉన్నవారిని బయటకు తీసుకురావడానికి రెస్యూ బృందాలు కష్టపడాల్సి వచ్చింది. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రమాదం జరిగిన తర్వాత ముందుగా లోపలికి వెళ్లిన స్థానికులు ఆ మంటలను చూసి భయంతో వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత యంత్ర సామగ్రితో లోపలికి వెళ్లిన అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను ఆర్పుతూనే బాధితులు ఉన్న చోటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని దగ్గర్లోని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లిలోని కేర్ దవాఖానలకు కార్లు, అంబులెన్స్‌లలో తరలించారు. అప్పటికే పొగ పీల్చడం వల్ల అపస్మారక స్థితిలో ఉన్నవారికి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా, మిగిలిన వారంతా చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. నలుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
భవనం మొదటి అంతస్తులో వ్యాపారి ప్రహ్లాద్ మోదీ కుటుంబం నివసిస్తున్నది. గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా బెంగా ల్ నుంచి కొందరు బంధువులు వ్యాపారి ఇంటికి వచ్చారు. అగ్నిప్రమాదంలో వారందరూ మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన బంధువులు రాత్రి అక్కడే బసచేసి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దుకాణంలో పనిచేసే సిబ్బందిని ఆ రాత్రి అక్కడే ఉండమని కోరినా వెళ్లిపోవడంతో వారు ప్రాణాలు దక్కించుకోగలిగారు.
అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మధ్యాహ్నం ఆయన దవాఖానలను సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తొలుత ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్మానియా, యశోద దవాఖానలను సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖ సరైన సమయంలో స్పందించలేదని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి సరైన యంత్ర సామగ్రిని సిద్ధం చేసుకోలేదని విమర్శించారు.
ప్రమాదం గురించి ఫోన్ వచ్చిన రెండు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, భవనం ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. భవనం లోపలికి వెళ్లే దారిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో మొదట లోపలికి వెళ్లేందుకు సాధ్యపడలేదు. ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఉండటం వల్లే మంటలు భారీగా వ్యాపించాయని అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. మొదట నిచ్చెన ద్వారా పైనుంచి నలుగురు కిందికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. భవనం పై అంతస్తుల్లో చికుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు కిటికీలు లేకపోవడంతో గోడలు పగులగొట్టి సహాయ చర్యలు చేపట్టారు. భవనం మొదటి అంతస్తులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఒకరు మాత్రమే వెళ్లే దారి ఉండటంతో బిల్డింగ్ పైభాగంలో ఒకవైపు గోడను కూల్చేశారు. అక్కడి నుంచి రెస్క్యూ టీం లోపలికి వెళ్లి వారిని రక్షించారు. మొత్తం 21 మందిని కాపాడారు. అపస్మారకస్థితిలో దవాఖానాల్లో చేరిన 17 మందిలో కొందరు చికిత్స పొందుతూ మృతిచెందారు. 11 వాహనాలు, ఒక ఫైర్ రోబోతో సహాయ చర్యలు చేపట్టినట్టు డీజీ నాగిరెడ్డి తెలిపారు. 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన హైదరాబాద్ డీఎఫ్‌వో వెంకన్నను దవాఖానలో చేర్పించారు.
చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం బాధాకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉండడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సా నుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ప్రభు త్వం మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపత్కాలంలో ఎలాంటి సాయం చేసేందుకైనా బీఆర్ఎస్ బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. డీజీపీ జితేందర్, ఫైర్ డీజీ నాగిరెడ్డిని అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కుమారుడు అజంఖాన్‌తో కలిసి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ లోపలికి వెళ్లి ప్రమాద తీవ్రతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. పలువురు ఎంఐఎం నాయకులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. 3 గంటల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.
బండ్లగూడ: చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి గౌతమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని పదిమంది ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అధికారులు గౌతంనగర్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి గౌతమ్‌నగర్‌లోని మృతుల కుటుంబాలను కలిసిన శ్రీధర్‌బాబు వారిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, కాసేపటి తర్వాత పురానాపూర్లోని శ్మశాన వాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మంటల్లో చికుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ప్రభు త్వం ఆదుకుంటుందని రేవంత్ భరోసా ఇచ్చా రు. బాధిత కుటుంబ సభ్యులతో సీఎం నేరుగా ఫోన్లో మాట్లాడారని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు పేర్కొంటూ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాణిజ్య సముదాయాల నిర్వహణ, అక్రమ కట్టడాల నియంత్రణ, అగ్ని ప్రమాద నివారణ, భద్రతలో అవినీతితో ప్రజల ప్రాణాలతో అధికారులు ఆడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు సర్కిల్-9 అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన పిటిషన్‌ను కమిషన్ విచారణకు స్వీకరించినట్టు రామారావు తెలిపారు.
మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండగా ఒకరికి ఒకటిన్నరేండ్లు. నాలుగేండ్లలోపు పిల్లలు ఆరుగురు, ఏడేళ్ల చిన్నారి ఒకరు ఉన్నారు. మృతుల్లో నలుగురు 60-75 ఏండ్ల వయసు వారు కాగా, 30-40 ఏండ్లలోపు వారు ఐదుగురు ఉన్నారు.
మృతులను రాజేంద్రకుమార్ (67), అభిషేక్ మోదీ (31),సుమిత్ర (60), మున్నీబాయి (70), ఆరుషి (3), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), ప్రియాన్ష్ (4), రజని అగర్వాల్ (32), అనుయన్ (3), పంకజ్ మోదీ (36), వర్ష మోదీ (35), ఇద్దు (4), రిషభ్ (4), ప్రథమ్ అగర్వాల్ (1.5), హమెయ్ (7), ప్రహ్లాద్ (70)గా గుర్తించారు.
హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని, 17 మంది ప్రా ణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొన్నా రు. మృతులకు సంతాపం తె లుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకోలేదని బాధితులే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. 17 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు ఆయన తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఆదేశించారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు.
అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తిచేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలువాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు.
ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జాన్ వెస్లీ మాట్లాడుతూ ఫైరింజన్లలో సరిపడా నీళ్లు, అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్లు లేవని తెలిపారు. అగ్నిప్రమాద ఘటన దురదృష్ట్రకరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.