నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 20 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగరావడంతో రోగులు ఆందోళన చెందారు. ఏం జరుగుతుందోనని బెంబేలెత్తిపోయారు. సిబ్బంది అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. పైఅంతస్తులోని వార్డుల్లోని రోగులను కిందకు దించారు. రోగులు పక్కవార్డులో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. పొగ వార్డుల్లోకి వెళ్లడంతో రోగులు ఇబ్బందిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గదిలోని ఫర్నిచర్, వస్తువులు కాలిపోయాయి. కంప్యూటర్ పరికరాలు మసిబారాయి. ఆర్డీవో రత్నకల్యాణి, జిల్లా వైద్యాధికారి రాజేందర్, అధికారులు ఘటనపై ఆరా తీశారు.