Fine Rice | మిర్యాలగూడ, ఏప్రిల్ 4 : అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైస్ మిల్లుల వద్దకు వెళ్తే మిల్లర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో అక్కడక్కడా వాన చినుకులు పడటం, వాతావరణం మబ్బులు పట్టడంతో ఇదే అదునుగా మిల్లర్లు ధాన్యం ధరలను అమాంతం తగ్గించేశారు. పలురకాల సాకులు చూపిస్తూ సన్నవడ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 ఉండగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వాటికి ప్రభుత్వం అదనంగా 500 బోనస్ ప్రకటించింది. ఈ లెక్కన క్వింటాకు రూ.2,820 వరకు ధర దక్కాలి. కానీ, రైస్ మిల్లర్లు మాత్రం ధాన్యం ధరలను అమా ంతం తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు బోరుబావుల కింద సాగు చేసిన రైతులు ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు వస్తున్నాయి. ధాన్యం ట్రాక్టర్లు రాక ఎక్కువగా ఉంటే రైస్‌మిల్లర్లు వాట్సాప్ ద్వారానే సంకేతాలు ఇచ్చుకొని ఆరోజు ఏ ధరకు కొనుగోలు చేయాలనేది నిర్ధారించుకొని సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని రూ.2,100 నుంచి రూ.2,200 వరకే కొనుగోలు చేస్తున్నారు. ధర పెంచాలని రైతులు అడిగితే పచ్చగింజ ఉంది.. మాకు అవసరం లేదు.. ఇష్టం ఉన్న చోట అమ్ముకోండి అంటూ దబాయిస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో మిలర్లు అడిగిన ధరకే ధాన్యాన్ని అప్పజెప్పి వెళ్తున్నారు. మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో తాము ధాన్యాన్ని ఎన్ని మిల్లుల వద్దకు తీసుకెళ్లినా సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మిలర్లు సిండికేటయి ధర తక్కువ నిర్ణయిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు సబ్‌కలెక్టర్‌కు ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
వారం క్రితం మిర్యాలగూడ పరిసర ప్రాంతాల రైస్ మిల్లుల్లో కావేరి చింట్లు, హెచ్ఎంటీ రకాల ధాన్యానికి రూ.2,400 నుంచి రూ.2,500 వరకు ధర పెట్టి కొనుగోలు చేశారు. ఎప్పుడైతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం అత్యధికంగా రావడం మొదలైందో అప్పటి నుంచే మిలర్లు ధరలను తగ్గించారు. క్వింటాకు రూ.2,100 నుంచి రూ.2,200కి ధర మాత్రమే చెప్తున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు నుంచి ధాన్యం పెద్దఎత్తున వస్తున్నా రైస్ మిల్లర్లు మాత్రం ఆంధ్రా ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి సన్నధాన్యం లారీల ద్వారా నల్లగొండ జిల్లాలోని రైస్‌మిల్లులకు వస్తున్నది. ఆంధ్రా నుంచి వస్తున్న ధాన్యం తక్కువ ధరకే ఇస్తుండడంతో మిల్లర్లు వాటిని కొనుగోలు చేస్తూ.. సాగర్ ఆయకట్టు ప్రాంతాల రైతుల ధాన్యాన్ని కూడా అదే ధరకు అడుగుతున్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏటా ధాన్యం కోతలు ప్రారంభం కాగానే మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైస్‌మిల్లర్లతో ఆర్డీవో సమావేశం నిర్వహించేవారు. రైతులకు సరైన ధర ఇవ్వాలని దిశానిర్దేశం చేసేవారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సమావేశం నిర్వహించి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని చెప్తుండేవారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా ఇంతవరకు రైస్‌మిల్లర్లతో అధికారులు సమావేశం నిర్వహించలేదు. ఇకనైనా అధికారులు ధాన్యానికి మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.