Home Guards | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర అవసరాలకే సరిపోతున్నదని హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నెలవారీ మెయింటనెన్స్ రూ.10 వేల వరకు తీసేస్తే, మరో రూ.16 వేల వరకు ఇంట్లో ఖర్చులు ఉంటున్నాయని చెప్తున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖ ర్చులు, ఈఎంఐలతో కుటుంబ పోషణ రోజు రోజుకు భారమవుతున్నదంటూ కన్నీటి పర్య ంతమవుతున్నారు. ఒత్తిళ్లతో ఇటీవల వరుసగా హోంగార్డులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని వివరిస్తున్నారు. తాజాగా అంబర్‌పేటలో వెంకటరమణ మృతి చెందగా, ఖైరతాబాద్ ఠాణా లో పనిచేస్తున్న సింహగిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలా నెలకు ఐదారుగురు మృత్యువాత పడుతున్నారు.
సీఎం గారూ.. ఆనాటి మాట ఏమైంది?
‘శ్రమకు తగ్గ జీతం లేదు.. హోంగార్డులను అక్కున చేర్చుకుంటాం.. వంద రోజుల్లో అధికారంలోకి వస్తున్నాం..’ అంటూ 2023 ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో హోంగార్డు రవీందర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రవీందర్ చికిత్స పొందుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి దవాఖానకు వెళ్లి, ఆయనను పరామర్శించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అన్ని సమస్యలు తక్షణమే పరిష్కారిస్తామని పేర్కొన్నారు. కానీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అన్నీ పెండింగే..!
పోలీస్ శాఖలో తమను విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని హోంగార్డులు కోరుతున్నారు. మృతి చెందిన హోంగార్డు కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టాలని, వీటి కోసం 600 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీవో 14, 15లో భాగంగా కానిస్టేబుళ్లతో సమానంగా యూనిఫాం, డైలీ అలవెన్స్‌లు రావాల్సి ఉన్నా.. రావడం లేదని చెప్తున్నారు. సాధారణ సెలువులు లేకపోవడంతో ఒక్కరోజు సెలవు తీసుకున్నా వేతనం కట్ చేస్తున్నారని, ఉన్నతాధికారుల వద్ద చాలామంది నిస్సహాయ స్థితిలో అర్డర్లీ వ్యవస్థలో పనిచేస్తూ వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వం వెంటనే స్పందించి స్పెషల్ పోలీస్ అసిస్టెంట్‌గా గతంలో చేసిన ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.