హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లను ఎట్టకేలకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 1,225 మంది టీచర్లను తిరిగి కొనసాగిస్తూ ఆర్థికశాఖ బుధవారం జీవో విడుదల చేసింది. 1 ఏప్రిల్ 2025 నుంచి 2026 మార్చి 31 వరకు ఏడాదిపాటు వీరిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన ఆరు నెలలకు ఈ టీచర్లను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులివ్వడం గమనార్హం. రాష్ట్రంలో డీఎస్సీ-2008 బాధితులకు సర్కారు కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించింది. ఏటా వీరిని రెన్యువల్ చేయాల్సి ఉండగా, ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు రెన్యువల్ చేయలేదు. దీంతో వీరంతా బడుల్లో పాఠాలు చెబుతున్నా.. పనిచేస్తున్నా జీతాలివ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఈ విషయంపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 6న ‘కాంట్రాక్ట్ టీచర్ల ఆకలికేకలు’ పేరిట కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో సర్కారులో కదలిక రాగా, తాజాగా రెన్యువల్ చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను అనుసరించి విద్యాశాఖ మరో ఉత్తర్వునివ్వాలి. మరో వారం, పది రోజులకు వీరికి వేతనాలు అందనున్నాయి.