హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేదు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి సంవత్సరం సుమారు రూ.1,430 కోట్లు టంఛన్‌గా వ స్తుండేవి. గత ఏడాది సర్పంచులు లేని కారణంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా విడుదల కాలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఈ ఆలస్యం ఇలాగే కొనసాగితే 2025-26లో రావాల్సిన రూ.1,477 కోట్లు కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. రెండేండ్లలో గ్రామాలు సుమారు రూ.3,000 కోట్ల నిధులను కోల్పోయే అవకాశం ఉన్నది.
2024 ఫిబ్రవరి 1న పంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం.. నిధుల విడుదలకు పాలకమండళ్లు అవసరం. ఈ నిబంధన కారణంగా 2024-25లో కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు నిలిచిపోయాయి. సకాలం లో ఎన్నికలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,109 కోట్లు, కర్ణాటకకు రూ.1,120 కోట్లు విడుదల కాగా, తెలంగాణ మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోయింది. ‘పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం గ్రామీణాభివృద్ధికి పెద్ద దెబ్బ. సర్పంచులు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధు లు నిలిచిపోయాయి. ఇది గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని దెబ్బతీస్తున్నది’ అని గ్రామీణాభివృద్ధి నిపుణులు చెప్తున్నారు.
రాష్ర్టాలకు నిధుల విడుదల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తున్నది. 2020-21 నుంచి 2023-24 వరకు పంచాయతీలకు రూ.6,051 కోట్లు విడుదలయ్యాయి. 2024-25లో ఒక రూపాయి కూడా రాలే దు. 2023-24లో కేటాయించిన 1,430 కోట్లలో రూ.1,424 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి, ఫిబ్రవరి 2024 నుంచి పాలకమండళ్లు లేని కారణంగా మిగిలిన రూ.ఆరు కోట్లకు కోత పెట్టారు. 15వ ఆర్థిక సంఘం గడువు 2026 మార్చితో ముగియనున్నది. 2024-25లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ. 1,514 కోట్లు పూర్తిగా నిలిచిపోయాయి. 2025-26లో రావాల్సిన 1,477 కోట్లు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే అం దవు. ఈ రెండేండ్లలో కలిపి రూ.3,000 కోట్ల నష్టం గ్రామీణ ప్రాంతాలకు వాటిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి, ఈ నిధులను గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలి. లేకపోతే, గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి పల్లె సింగిడి సకల సౌకర్యాలతో వర్ధిల్లితే.. 20 నెల ల కాంగ్రెస్ పాలనలో సమస్యల సుడిగుండం లో చిక్కుకున్నది. కేంద్రం నుంచి, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు విడుదల నిలిచిపోయింది. పంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు అందడం లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు కూడా కార్యదర్శి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. నీళ్లు పోయే దిక్కు లేక కేసీఆర్ హయాంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. పల్లె ప్రకృతివనం, నర్సరీల ఆలనాపాలనా కరువైంది. ప్రతి గ్రామం కొనుగోలు చేసిన ట్రాక్టర్ మూలకుపడింది. వైకుంఠధామం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ప్రధాన ఆధారం. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర సర్కారు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేనందున 2024 ఫిబ్రవరి నుంచి కేంద్రంతోపాటు రాష్ట్రం నుంచి నిధులు రావడం లేదు. పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, తైబజార్, భవన నిర్మాణ ఫీజులు, వ్యాపార, వాణిజ్య లైసెన్స్ఫీజుల ద్వారా కొంత మేరకు నిధులు సమకూరుతాయి. చిన్న గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు మినహా ఇతర ఆర్థిక ఆదాయ మార్గాలు పెద్దగా ఉండవు. పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరించి ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, తాగునీటి మోటర్ల రిపేరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర రోజువారీ కార్యకలాపాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.