సిద్దిపేట, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శానిటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి దవాఖానలో శానిటేషన్‌ను పెంచుతామని చెప్పారు. వైద్యులు రోగులపై ప్రేమ, ఆప్యాయతతో వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో దానికి రూ. 3.86 కోట్ల చొప్పున మొత్తం రూ.42.20 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను గణనీయంగా పెంచామని, ఇప్పటివరకు 720 ఉన్న జాబితాను 843 వరకు పెంచామని తెలిపారు.
ప్రతి దవాఖానలో 3 నెలలకు సరిపడా స్టాకు ఉండేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. డిశ్చార్జి ఆయ్యే పేషెంట్‌కు అవసరమైన మందులు ఇచ్చి పంపిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రూ.20 కోట్లతో బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పేరిట వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ రూపొందించామని చెప్పారు. వైద్య పరికరాల వివరాలన్నీ వెబ్ పోర్టల్‌లో నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం 8888526666 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు.
టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహరం అందించేలా ఒక్కో బెడ్‌కు డైట్ చార్జీలు పెంచామని వివరించారు. హైదరాబాద్‌లోని 18 మేజర్ ప్రభుత్వ దవాఖానల్లో రోగితో పాటు ఉండే సహాయకులకు రూ.5కే మూడు పూటల భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 834 ఆయూష్ డిస్పెన్సరీలు, 5 కళాశాలలు, 4 రీసెర్చ్ దవాఖానలు ఉన్నాయని తెలిపారు.