హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో పలువురు ఇంజినీర్లకు 8 నెలలుగా నిలిపివేసిన వేతనాలు విడుదల చేసేందుకు సర్కారు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్‌శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు ఉద్యోగ విరమణ పొందడంతో కీలకస్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయి అవసరాల రీత్యా ఈఎన్సీ, ఎస్ఈలు, ఈఈలు కలిపి 15మంది, డీఈఈలు 20 మంది, ఏఈఈలు 45 మంది కలిపి మొత్తంగా 81మంది ఇంజినీర్లను ఇరిగేషన్‌శాఖ వివిధ ప్రాంతాలను బదిలీ చేసింది. బదిలీలపై నిషేధమున్నా ఎలా బదిలీ చేశారని? ఇది నిబంధనలకు విరుద్ధమని సదరు ఇంజినీర్ల వేతనాలను ఆర్థికశాఖ నిలిపివేసింది.
ప్రభుత్వం నిరుడు వర్షాకాలం మొదట్లో శాఖాపరమైన బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ ఉత్తర్వుల నుంచి ఇరిగేషన్‌శాఖను మినహాయించింది. ఆ మినహాయింపు తర్వాతనే జీవో12 ప్రకారం ఇరిగేషన్‌శాఖ 81 మంది ఇంజినీర్లను బదిలీ చేసింది. ఇదే విషయాన్ని ఫైనాన్స్శాఖకు కూడా తెలిపింది. వేతనాలను విడుదల చేయాలని చాలాసార్లు లేఖలు రాసింది. కానీ ఆర్థికశాఖ అధికారులు వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఇదే విషయంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘ఇంజినీర్లకు వేతనాల్లేవ్’ పేరిట ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు రాపోలు రవీందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్ ఒక ప్రకటన విడుదల చేశారు.