MBBS Student | తండ్రి గల్ఫ్‌లో భవన కార్మికుడు.. తల్లి బీడీ కార్మికురాలు.. పొద్దంతా కష్టపడినా మూడు పూటలా తిండికి వెళ్లటమే గగనం. అయినా, తమ కుమారుడికి ఉత్తమ జీవితం ఇవ్వాలని ఆశపడ్డారు. అందుకోసం కాలంతోపోటీపడి కష్టపడుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఆ కుమారుడు కూడా వృథా పోనీయలేదు. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించి ఔరా అనిపించాడు. ఇంటర్‌లోనూ బీపీసీ గ్రూప్ చదవి కాలేజీ టాపర్లలో ఒకరిగా నిలిచాడు. డాక్టర్ కావాలన్న తన కలను సాకారం చేసుకొనేందుకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కానీ, విధి మరోలా తలచింది. అనారోగ్యమే అతన్ని కుంగదీసింది. చివరకు అతడు కలను నెరవేర్చుకోకుండానే బలవంతంగా తనువు చాలించాడు. కొడుకు కోసమే బతుకుతున్న తల్లిదండ్రులకు చివరకు పుట్టెడు కడుపుకోతే మిగిలింది. శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి హర్ష కుటుంబ పరిస్థితి ఇది.
నిజామాబాద్ క్రైం/మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దండేపల్లి, ఫిబ్రవరి 25: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న హర్ష తాను చదువుకుంటున్న హాస్టల్ గదిలోనే శుక్రవారం అర్ధరాత్రి బెడ్‌షీట్‌తో ఉరేసుకొని విగతజీవిగా మారాడు. అనారోగ్యమే అతని ఆత్మహత్యకు కారణాలని సమాచారం. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. కన్న కొడుకు కండ్ల ముందే తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు చెప్పిన మాటలు తలచుకొని గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో హర్ష స్వగ్రామం చింతగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాలేజీ ప్రిన్సిపాల్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, రాధ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు హర్ష 2018లో నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరాడు. శుక్రవారం స్నేహితులతో కలిసి డిన్నర్ చేసిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడు.
శనివారం ఉదయం గది తలుపులు తీయకపోవడంతో.. తోటి విద్యార్థులు ఎంత పిలిచినా డోర్ తీయలేదు. దీంతో వారు తలుపులను గట్టిగా నెట్టి తెరిచి చూడగా హర్ష బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. విద్యార్థులు కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని.. పోలీసులు, హర్ష కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. హర్ష చాలా తెలివైనవాడని, పరీక్షలు సైతం బాగా రాశాడని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, అతనికి ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని తోటి విద్యార్థుల ద్వారా తెలిసిందని చెప్పారు. హర్ష తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, ఇటీవలే దవాఖానలో చూపించుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. హర్ష ఆత్మహత్యతో తల్లి రాధ బోరున విలపించారు. తన కొడుకు డాక్టర్ అవుతాడని అనుకుంటే.. ఇంత పని చేశాడని కన్నీరుమున్నీరయ్యారు. ఐదు రోజుల క్రితం తనకు ఫోన్ చేసి వెన్నునొప్పి ఇంకా తగ్గలేదని బాధపడుతూ చెప్పాడని తెలిపింది.
తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని హర్ష తల్లి రాధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు.అమ్మా నువ్వేం దిగులు పడకు.. నొప్పి తగ్గుతది శుక్రవారం రాత్రి తల్లి రాధతో హర్ష ఫోన్లో మాట్లాడుతూ.. ‘అమ్మా.. మళ్లీ బ్యాక్ పెయిన్ వచ్చింది. స్థానిక దవాఖానలో స్కానింగ్ తీయించి, చికిత్స తీసుకున్నా. మందులు వాడుతా.. తగ్గుతుందిలే. నువ్వేం దిగులు పడకు అన్నాడు. నన్ను రమ్మంటావా బిడ్డా అని రాధమ్మ అడగ్గా.. నాలుగు రోజుల్లో పరీక్షలు అయిపోయాక నేనే వస్తా అమ్మా. వచ్చాక హైదరాబాద్‌కు వెళ్లి చూపించుకుందాం. డబ్బులు సిద్ధం చెయ్యి. డబ్బులకు భయపడకు. నేను డాక్టర్ అయ్యాక అన్ని తీరుస్తా అని ధైర్యం చెప్పాడు. తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది‘ అంటూ ఆ తల్లి బోరున విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
‘హర్షకు బ్యాక్ పెయన్ సమస్య రెండేండ్లుగా ఉంది. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లి చూపిస్తే మందులు రాశారు. నొ ప్పి తగ్గింది. నాలుగు రోజుల క్రితం నొప్పి మొదలైందని హర్ష ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాడు. మందులు కూడా వాడుతున్నాడు. శనివారం న్యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. శుక్రవారం సాయం త్రం తల్లితో మాట్లాడిండు. హాస్టల్లో రాత్రి 8.30 గంటలకు హర్ష గదికి ఎదురు రూమ్‌లో ఉండే చతుర్వేది వచ్చి చూడగా ఏడ్చినట్టు కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా ఏం కాలేదు.. నువ్వు వెళ్లు. నేను చదువుకోవాలి అని చెప్పాడు. చతుర్వేది రాత్రి 11.30 గంటల సమయంలో ఉదయం 3 గంటలకు నువ్వు లేచినప్పుడు నన్ను నిద్రలేపు హర్ష అని మెస్సేజ్ చేసినా సమాధానం రాలేదు. పడుకొని ఉండొచ్చని భావించాడు. ఉదయం 3 గంటలకు లేచిచూడగా రూమ్‌లో లైట్ వేసి ఉంది. చదువుకుంటున్నాడని స్నేహితులు భావించారు. 7.30 గంటలకు టిఫిన్ చేసేందుకు వెళ్లే సమయం లో చూడగా రూమ్ తలుపు మూసే ఉంది. ఎంత కొట్టినా హర్ష తీయలేదు. గది కిటికీలో నుంచి చూ డగా ఉరేసుకొని కనిపించాడు’ అని హర్ష బంధువులు చెప్పారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.