హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ స్టేషన్లవారీగా లిస్టులను తయారు చేస్తున్నది. శనివారం తుది జాబితా విడుదల చేయనున్నది. తెలంగాణలో 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, 2024లో నిర్వహించిన సీపెక్ సర్వే ఆధారంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం మొత్తం సీట్లల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇచ్చారు. మున్సిపాలిటీల్లో వార్డులవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం ఉదయం కలెక్టర్ల ఆధ్వర్యంలో లేదా మున్సిపల్ కమిషనర్ల సమక్షంలో ప్రక్రియ జరుగనున్నది.
ఉదయం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. వార్డు రిజర్వేషన్లు ఖరారు కానుండటంతో స్థానిక నేతల్లో ఉతంఠ నెలకొన్నది. తమ వార్డు ఏ క్యాటగిరీకి మారుతుందోనన్న ఆందోళన ఒకవైపు, తమకు అనుకూలంగా వస్తే ప్రచారం మొదలుపెట్టాలనే ఉత్సాహం మరోవైపు కనిపిస్తున్నది. ముఖ్యంగా జనరల్ స్థానాలుగా ఉన్న వార్డులు రిజర్వ్డ్ అయితే, అకడి సీనియర్ నాయకులు ప్రత్యామ్నాయ వార్డుల కోసం వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది. దీని ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ ప్రకటించనున్నది. ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ ఉన్నందున అందులో చర్చించిన తర్వాత షెడ్యూల్ వస్తుందా? లేదా శనివారం విడుదల చేస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.