హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి జూన్ 23 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి పరిశీలన నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హత కలిగిన వారు బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు. జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్ కేంద్రాల బౌండరీలు నిర్ధారణ చేయనున్నారు. జూలై 25 నుంచి 31 వరకు నమూనా ఓటరు జాబితా రూపొందించనున్నారు. ఆగస్టు 2న ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 31 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, సెప్టెంబర్ 22 లోగా పరిష్కరిస్తారు.
అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు