Allu Arjun | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరు, ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్నట్టుగా సర్కారు పెద్దలు కక్షతో వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర భుత్వం ఉద్దేశమేంటి? వ్యక్తిగతంగా కక్షగట్టినట్టుగా సీఎం రేవంత్, ప్రభుత్వంలోని ముఖ్యు లు మాట్లాడుతున్నారని సినీవర్గాల్లో అభిప్రా యం వ్యక్తమవుతున్నది. సినీపరిశ్రమను దారిలోకి తెచ్చుకోవడం కోసమే ఇదంతా జరిగిందని కొందరు చెబుతుంటే వసూళ్ల దందాలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని మరికొందరు చెబుతున్నారు.
టాలీవుడ్‌ను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయస్థాయి గుర్తింపు కలిగిన అల్లు అర్జున్ ను అరెస్టు చేసిందని సినీప్రముఖులు అంటున్నారు. అంతేకాకుండా సినిమా పెద్దలను బెదిరించేందుకు ‘కొంతమంది’ ఓ బ్లాక్‌మెయిలర్ ను రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి.
అందుకే కోట్లలో వ్యాపారం చేస్తున్న ని ర్మాతలు, భారీగా ఆర్జిస్తున్న నటులను టార్గెట్ చేసినట్టు పేర్కొంటున్నారు. సినిమాలకు అనుమతులు ఇచ్చే దగ్గర్నుంచి, టికెట్ల ధరల పెంపు వరకు ప్రభుత్వ పెద్దల సహకారం అవసరం ఉంటుంది. ఇదే అవకాశంగా తీసుకున్న ‘కొందరు’ మాట వినని వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని సినీప్రముఖులు ఆ రోపిస్తున్నారు. గత ప్రభుత్వ ‘పెద్దలు’ సినీ పరిశ్రమను సున్నితంగా హ్యాండిల్ చేశారని, ఈ సర్కారు మాత్రం ప్రముఖులను ఇబ్బందులు పెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వె ల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అయితే నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. శుక్రవా రం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ను జాతీయ మీడియా ప్రతినిధులు నిలదీశారు. అల్లు అర్జు న్ అరెస్ట్ కక్ష సాధింపులో భాగం అనే విమర్శ ల నుంచి బయటపడేందుకు సీఎంతోపాటు ప్రభుత్వ పెద్దలు కొత్త ఎత్తుగడ వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ‘అల్లు అర్జున్ మా బంధువే’ ‘అల్లు అర్జున్ భార్య మాకు చుట్టమే’ ‘మెగా ఫ్యామిలీకి మేము చాలా క్లోజ్’ అనే డైలాగులు కాంగ్రెస్ నేతల నోట వినిపిస్తున్నాయని అంటున్నారు.
నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను సినీ ప రిశ్రమ ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి గట్టిగా స్పందించాలని సినీపెద్దల మధ్య చర్చ జరిగిన ట్టు తెలుస్తున్నది. వేల కోట్లు పన్నులు కడుతున్న తమపై వేధింపులేంటని కొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్వార్థం కోసం తమను వేధిస్తే ఊరుకోమని చెబుతున్నారు.