హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గ్రూప్-1 అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. వివాదాలకు నిలయంగా మారిన టీజీపీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలి. గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించి పారదర్శకతను చాటాలి’ అని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ ఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. గ్రూప్-1 అవకతవకలను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్, కార్యదర్శి టీ నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మాట్లాడారు. వరుస వివాదాలతో టీజీపీఎస్సీ కేంద్ర బిందువుగా మారిందని విమర్శించారు. టీజీపీఎస్సీ తీరుతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రూప్-1 ప్రక్రియలో అనేక అనుమానాలకు తావిచ్చిన టీజీపీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు.
పరీక్ష పత్రాలను నిపుణులైన ప్రొఫెసర్లతో, తె లుగు మీడియం పేపర్లను తెలుగు మీడి యం వారితోనే, ఆయా సబ్జెక్టుల నిపుణులతోనే మూల్యాంకనం చేయించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు న్యా యం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని వారు స్పష్టంచేశారు.