Banakacherla | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా బందయ్యే వరకు తమ పోరాటం ఆగదని, తెలంగాణ ప్రయోజనాల కోసం, రైతు సమస్యలు తీర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కే సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర అటవీ, పర్యావరణ నిపుణుల కమిటీ తిరస్కరించగానే సంబరం చేసుకోవడం కాదని, దానిని సంపూర్ణంగా నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డిని కోరారు.
మేడిగడ్డను బంద్‌పెట్టి తెలంగాణను ఎండబెడుతున్న రేవంత్‌రెడ్డా కేసీఆర్‌పై విమర్శలు చేసేది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బనకచర్ల విషయంలో కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టాలన్న సీఎం ఆటలు సాగవని తేల్చి చెప్పారు. 240 టీఎంసీలు వాడుకునేలా కేసీఆర్ కాళేశ్వరం కట్టడం తప్పుగా కనిపిస్తున్నదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై విరుచుకుపడుతున్న రేవంత్ చంద్రబాబును ఒక్కమాట కూడా అనడం లేదెందుకని నిలదీశారు.
కేసీఆర్‌ను, హరీశ్‌రావును తిట్టడం తప్ప రేవంత్ వద్ద మరో సబ్జెక్ట్ లేదని గంగుల ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం రేవంత్ మాట్లాడిన దానిలో కొత్తదనం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎంతసేపు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌రావును తిట్టడం, బూతులు మాట్లాడడం, రోజా రొయ్యల పులుపు గురించి తప్ప.. ఆయనకు గోదావరి, ప్రాజెక్టుల వంటి వాటిపై ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను తిట్టాలి.. ఏపీ సీఎం చంద్రబాబును కాపాడాలి అన్న ఆతృత ఆయనలో కనిపించిందని అన్నారు. బనకచర్ల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కోసం లక్షల రూపాయలు వృథా చేశారని ఆరోపించారు.
బనకచర్లపై హరీశ్‌రావు ప్రెస్‌మీట్ తర్వాతే సర్కారు మొద్దు నిద్ర వీడిందని గంగుల పేర్కొన్నారు. ఆ తర్వాతే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోవాలని చెప్తే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బనకచర్ల ప్రతిపాదన ఎక్కడుందని నిలదీశారు. బనకచర్లకు కేంద్రం పర్యావరణ, అటవీశాఖ అనుమతులు నిరాకరించడం బీఆర్ఎస్ పార్టీ విజయమన్నారు. అయినా ఆ ప్రాజెక్టు మొత్తం ఆపే వరకు బీఆర్ఎస్ పార్టీ విశ్రమించదని తేల్చి చెప్పారు.
తెలంగాణలో నీళ్లమీద, రాష్ట్రం మీదే యుద్ధం జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా కోసం అంగీకరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలో వృథాగా పోతున్నాయన్నది కేసీఆర్ మాట కాదని, 50 ఏండ్ల సగటున సీడబ్లూసీ లెక్కలు చెప్తున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఆ వృథా నీటిలో తెలంగాణ వాటాగా 1950 టీఎంసీలు ఇప్పుడున్న వాటా కంటే అదనంగా కోరినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. గోదావరి నీళ్లు సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి పోతుంటే అవి మిడ్‌మానేరుకు పోతాయంటూ రేవంత్‌రెడ్డి మరోసారి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణకు బీఆర్ఎస్సే రక్షణ కవచమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ నీటి హక్కుల కోసం పని చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావును విమర్శించడం కోసమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌పై నెపం నెట్టి చంద్రబాబు బనకచర్ల కట్టేందుకు అనుమతిస్తారా? అని నిలదీశారు. గోదావరి మిగులు జలాలపై తెలంగాణ వాటా సాధించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
గోదావరి-బనకచర్ల అంశంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. దమ్ముంటే వచ్చే సోమవారమే సమావేశాలు నిర్వహించాలని, బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావుతో పాటు అందరం హాజరవుతామని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి వివరంగా చర్చిద్దామని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకున్నారని దుమ్మెత్తిపోశారు. మిషన్ కాకతీయ, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసిన కేసీఆర్ చిత్తశుద్ధిని కాంగ్రెస్ నేతలు శంకించలేరని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సెల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టును మొత్తంగా తిరస్కరించాలని డిమాండ్ చేశారు.