సంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం డంపింగ్ యార్డు పనులను నిలిపివేసే వరకు పోరాటం ఆగదని సమీప గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా డంపింగ్ యార్డు పనులు చేపడుతున్నదని మండిపడుతూ సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద గురువారం ఆందోళనలు కొనసాగించారు. ప్రభావిత గ్రామాల ప్రజలు, రైతులకు మద్దతుగా సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళన అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన సాగడంలేదని, ప్రజాకంటక పాలన సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటవీశాఖ అనుమతులు లేకుండా రోడ్డు నిర్మిస్తున్నదని, హైకోర్టు స్టేను లెక్కచేయకుండా డంపింగ్ యార్డు పనులు చేస్తున్నదని, ఎన్నికల కోడ్‌ను కూడా ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు. ప్రశ్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి, బైండోవర్‌కు యత్నించడం దారుణమని ధ్వజమెత్తారు. డంపింగ్ యార్డుకు సమీపంలోని ప్యారాగనర్, నల్లవల్లి గ్రామాల పరిధిలో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. డంపింగ్‌యార్డుతో గద్దలు, కాకుల సంచారం పెరిగి సమీపంలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన విమానాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని తెలిపారు. అకాడమీ అధికారులు కూడా స్పందించాలని కోరారు. ప్రభుత్వం డంపింగ్ యార్డు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు దేవేందర్, ఆదర్శ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటేశం, ప్రభాకర్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్, ఫిబ్రవరి 6: ప్యారానగర్ డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షనేతలు ధర్నా నిర్వహించారు. నేతల పిలుపుతో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో కురిసే నీరంతా నర్సాపూర్ రాయారావు చెరువులోకి చేరుతుందని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే చెరువు నీళ్లు పూర్తిగా కలుషితమవుతాయని తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఉద్యమంలో కలిసివచ్చిన బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులను అభినందించారు. డంపింగ్ యార్డు రద్దయ్యే వరకు ఇదే ఐక్యతతో ముందుకుసాగాలని, పోరాటంలో కాంగ్రెస్ నాయకులు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్‌నేతలు సింగాయిపల్లి గోపి, సంతోష్‌రెడ్డి, సత్యంగౌడ్, అశోక్‌గౌడ్, నయీమొద్దీన్, బీజేపీ నేతలు మల్లేశ్‌గౌడ్, సీపీఐ నాయకుడు ఖాలేఖ్ తదితరులు పాల్గొన్నారు.