సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 13: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, మరో వ్యక్తితో ఘర్షణ పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిద్దిపేట- సిరిసిల్ల రహదారిలో సిద్దిపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు గురువారం వేములవాడ నుంచి సిద్దిపేటకు వెళ్తున్నది.
మార్గ మధ్యలో తంగల్లపల్లి మండలం నేరెల్ల శివారులోని బాలికల గురుకుల పాఠశాల మూలమలుపు వద్దకు చేరుకోగానే, బస్సులో ఉన్న ఓ వ్యక్తికి, ముగ్గురు మహిళలు సీటు కోసం గొడవ పడ్డారు. సదరు మహిళలను దుర్భాష లాడటంతో ఘర్షణ మొదలైంది. గొడవ ముదిరి తన్నుకున్నారు. జుట్టు పట్టి లాగి, ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేయగా, కండక్టర్ అతికష్టం మీద గొడవ పడ్డ వ్యక్తిని బస్సు లోంచి దింపేశారు. అయినప్పటికీ మహిళలు కిందకు దిగి వ్యక్తిని కర్రలతో కొట్టడం గమనార్హం. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, సదరు వ్యక్తి పరారయ్యాడు. దీనిని పలువురు ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.