హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : గురుకులాల పనివేళలపై ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ప్రతిపాదిస్తున్న దానికి, ప్రస్తుతమున్న టైంటేబుల్‌కు పెద్దగా తేడా ఏమీలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉన్న పనివేళలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉదయం 8 నుంచి సాయంత్రం 4:30కు మార్చింది. పలు గురుకులాలు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయని, బాత్ రూములు, నీరు, వంట గది తదితర వసతులు సరిపడా లేవని, విద్యార్థులకు పరిగడుపున క్లాస్‌లు చెప్పాల్సి వస్తున్నదని, తిరిగి క్లాస్ మధ్యలో బ్రేక్ ఫాస్ట్‌కి పంపాల్సిన పరిస్థితి నెలకొన్నదని టీచర్లు వివరిస్తున్నారు. విద్యార్థులు ఏకంగా 3 గంటలపాటు పాఠాలు వినాల్సి వస్తున్నదని, 16గంటల షెడ్యూల్లో కనీసం 2:30గంటలపాటు పర్సనల్ టైము కూడా లేదని, దీంతో వారు ఏకాగ్రత కోల్పోవడంతోపాటు ఒత్తిడిని అనుభవిస్తున్నారని ఏడాది కాలంగా టీచర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన పనివేళల వల్లనే విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయని టీచర్లు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం తగినంత సమయం లేకపోవడంతో వంటపాత్రల శుభ్రత సరిగా లేక ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నూతన టైంటేబుల్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న టైంటేబుల్‌కు, కొత్త ప్రతిపాదనలకు తేడా ఏమీలేదని గురుకుల టీచర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
విద్యార్థుల పర్సనల్ టైమ్‌ను మరో అరగంట పొడిగించారే తప్ప మరేమీ లేదని వివరిస్తున్నారు. గతంలో 7:45-8గంటల వరకు కిచెన్ ఇన్స్పెక్షన్ ఉండగా ప్రస్తుతం దానిని 8గంటల నుంచి 8:15కు మార్చారని వివరిస్తున్నారు. కిట్ ఇన్స్పెక్షన్ చేయాలంటే టీచర్లు 8గంటలకే గురుకులాలకు చేరుకోవాల్సి ఉంటుందని, విద్యార్థులు కూడా అంతకుముందే అల్పాహారం ముగించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అలాయితే పనివేళలు ఎలా మార్చినట్టు అని గురుకుల యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. గురుకుల టైంటేబుల్‌ను గతంలో మాదిరిగా మార్చాలని ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నాయి.