Congress Party | నర్సాపూర్: కాంగ్రెస్ పార్టీలో ఇరు మండలాల కార్యకర్తల పోరు మరోసారి భగ్గుమంది. నువ్వు ముందా.. నేను ముందా.. అనే ధోరణిలో ఒకరిని ఒకరు దూషించుకుంటూ పోటీ పడడం కార్యకర్తల్లో అసహనం కలిగించింది. వివరాలకు వెళితే రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నర్సాపూర్ రావడం జరిగింది. నర్సాపూర్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మార్గంలో స్వాగతం పలకడానికి వేచి ఉన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి రాగానే స్వాగతం పలికే విషయంలో నర్సాపూర్, శివంపేట్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీలు పడ్డారు. నువ్వు ముందా.. నేను ముందా.. అనే ధోరణిలో శాలువాలు కప్పడానికి ఒకరిని తోసుకుంటూ మరి ఒకరు దూకుడు ప్రదర్శించారు.
ఈ సంఘటనలో ఇరు మండలాల కార్యకర్తల మధ్య చిన్నపాటి గొడవ దారి తీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి గొడవ రాజుకుంది. మా నర్సాపూర్ మండలంలో మీ పెత్తనం ఏంటని నర్సాపూర్ నాయకులు, ఇది నియోజకవర్గ కేంద్రమని శివంపేట్ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం జరిగింది. మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా మొదటిసారి నర్సాపూర్ వచ్చిన సందర్భంలో కార్యకర్తలు గొడవ పడడం కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తిని కలిగించింది. గతంలో కూడా ఓ ర్యాలీలో కూడా ఇరు మండలాల కార్యకర్తలు గొడవపడడం జరిగింది. నర్సాపూర్, శివంపేట్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటుందని ఇతర కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారూ. అక్కడున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు గొడవను సద్దుమణిగించారు.