వరంగల్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారం సమ్మక-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో వెలసిన ఐదో గద్దె అదృశ్యమైంది. వారం రోజుల క్రితం పగిడాపూర్ గ్రామస్థులు సమ్మక తమ్ముడు, ఆమెకు సేనాధిపతిగా చెప్పుకొనే వనం పోతురాజు గద్దెను గద్దెల ప్రాంగణంలో వేశారు. ఆ గద్దె మొదట లేదని, అసలు మేడారం మాస్టర్ ప్లాన్‌లోనే లేదని దానిని తొలగించారు. చిలుకల గుట్ట నుంచి సమ్మక గద్దెకు చేరే రోజు ఉదయం సమ్మక వడ్డెలు (పూజారులు) పగిడాపూర్ సమీపంలోని వనం గుట్టకు వెళ్లి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కంక వనానికి పూజలు చేసి కంకను గద్దె మీదికి తేవడం ఆనవాయితీ. ప్రభుత్వం ఈ సారి జాతర నేపథ్యంగా సుందరీకరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పగిడాపూర్ వాసులు తమకు తల్లుల గద్దెల ప్రాంగణంలో వనం పోతురాజు గద్దె వేయాలని పట్టుబట్టారు. అంతేకాకుండా గద్దెను వేశారు. మొదట వేసిన గద్దెను తొలగించడంతో ఆ తర్వాత మళ్లీ వేశారు. వారం రోజులపాటు మేడారం సందర్శించిన భక్తులకు వనం పోతురాజు గద్దె చర్చనీయాంశమైంది. ఇదే అంశాన్ని ఈ నెల 15న ‘మేడారంలో ఐదో గద్దె’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
అయితే ఆదివారం మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు భారీ ఎత్తున మేడారానికి పయనమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొత్తగా వెలసిన ఆ ఐదో గద్దెను తొలగించారు. ఈ ఘటన మేడారంలో హాట్‌టాపిక్‌గా మారింది. తమ ఆరాధ్య దైవం వనం పోతురాజు గద్దెను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా గద్దెను మళ్లీ వేసుకునే అవకాశం ఇవ్వాలని పగిడాపూర్ వాసులు పట్టుబడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేవాదాయ శాఖ, పోలీసులు, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్లానింగ్‌లో లేని కారణంగానే దానిని ఎవరైనా తొలగించి ఉండొచ్చని దేవాదాయ శాఖ పేరొంటున్నది. ఈ విషయంలో తమతో అధికారులు, మంత్రి సీతక కూడా మాట్లాడారని, సీఎం ప్రోగ్రాం అయ్యాక సోమవారం సాయంత్రం గద్దెను వేసి పూజలు చేస్తామని పగిడాపూర్ వాసులు తేల్చి చెప్తున్నారు. మొత్తానికి మునుపెన్నడూలేని విధంగా ఈ సారి జాతర కోయ తెగల మధ్య సరార్ కొత్త పంచాయితీ పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.