Congress | (నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్): ‘కేసీఆర్ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాల్వల నీళ్లు బంద్ అయ్యాయి. మేం వేసుకున్న పంటలన్నీ ఎండిపోతున్నాయి. పంట పెట్టుబడి అందకపోవడంతో అప్పులు చేశాం.
వాటిని ఎవరు తీర్చాలి ? మాకు మళ్లీ బొంబాయి కష్టాలు మొదలవుతున్నాయి’ అంటూ వనపర్తి మండలంలోని కీర్యాతండా, గుంత తండాలకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఈ రెండు తండా ప్రజలదే కాదు.. రాష్ట్రంలోని రైతులందరీ పరిస్థితీ ఇలాగే ఉంది.
కాంగ్రెస్ హయాంలో కాల్వల్లో నీళ్లు రాక, సమయానికి కరెంట్ రాక రైతులు అరిగోసపడుతున్నారు. పొలం తడి పెట్టేందుకు తండ్లాట పడుతున్నారు. కండ్ల ముందే ఎండిన పంటను చూడలేక ట్యాంకర్లతో నీళ్లు పెడుతూ తల్లడిల్లిపోతున్నారు. పొట్ట దశలోకి వచ్చిన పచ్చని పంటలను పశువుల మేతగా వదిలేస్తున్నారు. వడ్లు అమ్ముకోవాల్సిన రైతులు గొర్రెలకు, పశువులకు అడ్డికి పావుశేరుకు గడ్డి అమ్ముకుంటున్నారు.
మళ్లీ బొంబాయి కష్టాలు..
ఎప్పటిలాగే కాల్వ నీళ్లు వస్తాయని ఆశపడ్డ. ఎనిమిది ఎకరాల్లో వరి వేశాను. ఇప్పటికే నాలుగెకరాలు ఎండిపోయింది. మిగిలింది కూడా ఎండిపోవడమే తప్పా పండేది లేదు. లక్షల రూపాయల పంటలు పండించినోళ్లమే తినడానికే మళ్లీ కొనుక్కొనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు కూడా పడడం లేదు. మాకు మళ్లీ బొంబాయి కష్టాలు మొదలయ్యాయి.
– ఎల్.పాండు, కుంటోని తండా, వనపర్తి మండలం
పరిహారం ఇవ్వాలి..
కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేయకుండా ముందే నిలుపుదల చేయడంతో వేసుకున్న పంటలన్నీ ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంట చేలను చూస్తే.. ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. పదేండ్లుగా పంటలు పండించిన రైతులు ప్రస్తుతం కన్నీరుమున్నీరవుతున్నారు. పెట్టుబడిలేక అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.
-కె.మాణిక్యం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, వనపర్తి
కరెంటోళ్లు కనికరించకపాయే ఇదీ గొల్లపల్లి రైతుల గోస
నెన్నెల, మార్చి 9 : ‘100 కేవీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ లీకవుతుందని, లో వోల్టేజీ సమస్య ఉందని నెల కిందే ఏఈకి చెప్పినం. బోర్లు కాలిపోతున్నయి… నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి.. ఎంత మొరపెట్టుకున్నా కరెంటోళ్లు కనికరించకపాయే’ అని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన రైతులు శనివారం నెర్రెలు బారిన పంట పొలాలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఊరిలోని 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 80 ఎకరాలకు పైగా వరి సాగయ్యిందని, అధికారుల నిర్లక్ష్యంతో పంట చేతికందకుండా పోయే పరిస్థితి దాపురించిందని తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ విషయమై ఏఈ మల్లయ్యను వివరణ కోరగా, రైతులంతా ఒకేసారి మోటర్లు స్టార్ట్ చేయడం వల్ల డీటీఆర్ మీద ఓవర్లోడ్ పడుతుందని, దాంతో ఫీజులు ఆగడంలేదని, రైతులు సమన్వయంతో కరెంటును వినియోగించుకోవాలని అన్నారు.
ట్యాంకర్ అద్దెకు తీసుకున్న..
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసిన. సుమారు రూ. 60 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పొలమంతా పొట్ట, ఈత దశలో ఉంది. సాగునీళ్లు లేక ఇబ్బంది అవుతుండడంతో ఓ రైతు వద్ద రూ. 10 వేలకు బోర్ నీళ్లు మాట్లాడుకొని ట్యాంకర్ను అద్దె తీసుకొని వరి చేనుకు పోస్తున్న. ఇలా రెండెకరాలు పారుతుంది. మిగిలిన రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఏడేనిమిదేళ్లుగా నీళ్ల కరువు లేకుండా ఉండేది. ఇప్పుడే ఇబ్బంది అవుతుంది. నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తారో చూడాలె మరి.
-గొట్టె మహేందర్, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా