Salary Package | హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ఐఐటీలు.. అత్యుత్తమ చదువులకే కాదు.. అత్యుత్తమ వేతన ప్యాకేజీలకు సైతం కేరాఫ్ అడ్రస్. అయితే వాటిలో చదివిన కొంతమందే టాప్ వేతన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. చాలామందికి అతి తక్కువ వేతన ప్యాకేజీలే లభిస్తున్నాయి. కానీ టాప్ వేతన ప్యాకేజీలకు అత్యధిక ప్రాచుర్యం లభిస్తుంది. పలు ఐఐటీల్లో కనిష్ఠ వేతనం 6 నుంచి 7లక్షలలోపే ఉంటుంది. టాప్ విద్యాసంస్థల్లో చదివినా వేతన ప్యాకేజీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. లేఆఫ్‌లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఐఐటీల్లోని విద్యార్థుల వేతన ప్యాకేజీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
దీంతో అత్యధిక వేతన ప్యాకేజీలకు కనిష్ఠ వేతన ప్యాకేజీల మధ్య అంతరం భారీగా ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌లో 2018-19లో గరిష్ఠ వేతన ప్యాకేజీ రూ.29.28లక్షలుండగా, 2021-22కు వచ్చేసరికి రూ.41.72లక్షలకు చేరింది. ఇదే విద్యాసంస్థలో కనిష్ఠ వేతన ప్యాకేజీ 5.4లక్షల నుంచి 6లక్షలుగా ఉంది. అలాగే ఐఐటీ ఢిల్లీలో 2023లో అత్యధిక ైస్టెపెండ్ నెలకు రూ.4.04లక్షలు ఉండగా, సగటు ైస్టెపెండ్ రూ.2.63లక్షలుండగా, కనిష్ఠ వేతనం రూ.10లక్షలలోపే ఉంది. కాగా ఐఐటీ బాంబేలో 22 మంది విద్యార్థులు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీని సొంతం చేసుకోగా, అతి తక్కువ వేతన ప్యాకేజీ రూ.4- 6లక్షలుగా నమోదైంది.