ఇంటింటికీ చేరిన ప్రభుత్వ వైద్యం
రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన కరోనా
సగానికిపైగా తగ్గిన రోజువారీ కేసులు
25 జిల్లాల్లో పూర్తయిన సర్వే
14 జిల్లాల్లో రెండో విడత ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జ్వర సర్వే గత నెల 21న ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా వైద్యారోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖలకు చెందిన బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే మొదలు పెట్టాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు అందజేశారు. మరోవైపు లక్షణాలు కాస్త తీవ్రంగా ఉన్నవారి కోసం కొవిడ్ ఓపీని నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జ్వర సర్వేను స్వయంగా పర్యవేక్షించారు.
15 రోజుల్లో 1.21 కోట్ల ఇండ్లు..
జ్వర సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 16,299 బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాల సభ్యులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 25 జిల్లాల్లో తొలివిడత సర్వే పూర్తయిం ది. మిగతా జిల్లాల్లో తుది దశలో ఉన్నది. 14 జిల్లాల్లో రెండోవిడత సర్వే కూడా ప్రారంభమైంది. మొత్తంగా శుక్రవారంనాటికి 15 రోజుల్లో 1.21 కోట్ల కుటుంబాలను సర్వేచేశారు. 3.91 లక్షల మందికి జ్వరం, జలు బు, దగ్గు వంటి అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 3.80 లక్షల మందికి కిట్లు పంచారు.
10.55 లక్షల మందికి ఓపీ
జ్వర సర్వేలో భాగంగా పీహెచ్సీస్థాయి వరకు ప్రత్యేకంగా 1,170 ‘కొవిడ్ ఓపీ’ కేంద్రాలను ప్రారంభించారు. జ్వర సర్వే సమయంలో అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఈ కొవిడ్ ఓపీ కేంద్రాలకు తరలించారు. వైద్యులు వారిని పరిశీలించి, అవసరమైన వారికి మందుల కిట్లు అందజేశారు. 15 రోజుల్లో 10.55 లక్షల మంది కొవిడ్ ఓపీలకు వెళ్లారు. ఇం దులో 1.34 లక్షల మందికి కిట్లను పంపిణీచేశారు. జ్వర సర్వే, కొవిడ్ ఓపీలో కలిపి మొత్తం 5.14 లక్షల మందికి కిట్లను అందజేశారు. జ్వర సర్వే గత నెల 21న ప్రారంభం అయ్యింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 4,416 కేసులు నమోదు కాగా, 15 రోజుల తర్వాత కేసుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. శుక్రవారం 2,387 మందికి పాజిటివ్‌గా తేలింది. సెకండ్ వేవ్‌లో జర్వ సర్వే నిర్వహించి కరోనా కట్టడికి కొత్త మార్గాన్ని చూపడం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. థర్డ్ వేవ్ సమయంలోనూ జ్వర సర్వే నిర్వహించి మరోసారి ప్రశంసలు అందుకొంటున్నది. గత నెల 28న కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సూఖ్ మండావియా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జ్వర సర్వే ప్రారంభించడాన్ని ‘ఉత్తమ వ్యూహం’గా ఆయన అభినందించారు.
కొవిడ్ సోకినట్టు కాదు.. లక్షణాలు మాత్రమే
జ్వర సర్వేలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణా లు ఉన్నవారికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఐసొలేషన్ కిట్లను అందజేశారు. అంతే తప్ప వారందరికీ కొవిడ్ సోకినట్టు కాదని అధికారులు తెలిపారు. లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరికీ టెస్టులు కూడా చేయడం వ్యయప్రయాసలతో కూడుకొన్నది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఐసొలేషన్ కిట్లను అందించి, ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేసినట్టు వెల్లడించారు.
వ్యాప్తిని నియంత్రించ గలుగుతున్నాం
కరోనా వ్యాప్తి కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి, విజయవంతంగా అమలు చేసిన కార్యక్రమం ఫీవర్ సర్వే. ఇప్పటికే సెకండ్ వేవ్‌లో తెలంగాణను చూసి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేశారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి చేపట్టిన ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నాం. మొదటి విడత సర్వే దాదాపు పూర్తయింది. కొన్ని జిల్లాల్లో రెండో విడత సర్వే మొదలైంది. ఇప్పటివరకు 1.2 కోట్ల ఇండ్లల్లో సర్వే పూర్తయింది. సర్వేలో భాగస్వాములైన సిబ్బందిని అభినందిస్తున్నాను. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే మండలాల్లో అవసరమైతే రెండు, మూడో సర్వే కూడా చేయాలని అధికారులను ఆదేశించాం.
– హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి