మేడ్చల్ : పండితులు తీసుకునే నిర్ణయాలు జగత్ కల్యాణదాయకమై, లోకాన్ని నడిపించేలా ఉండాలని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామభద్రక్షేత్రంలో శనివారం తెలంగాణ విత్వత్సభ పంచమ వార్షిక విద్వత్సమ్మేళనం జరిగింది. ఈ విద్వత్సభలో శుభకృత్ 2022-23 సంవత్సరంలో పండగల నిర్వహణ తేదీలను పండితులు, సిద్ధాంతులు, ప్రముఖ దేవాలయాల ఆస్థాన పండితులు, అర్చకులు కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయించారు. పండుగల తిథులు, వారాలు, తేదీలనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నిర్ణయాలను వారివారి పంచాంగాల్లో సిద్ధాంతులు ప్రచురించాలని ముక్తకంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు.
విద్వత్సభకు ముఖ్యఅతిధిగా విద్యాశంకర భారతీస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిష చక్రం పరబ్రహ్మ స్వరూపమని, పంచాంగాన్ని నిర్ణయించే క్రమంలో ముక్తకంఠంతో ఏకవ్యక్త ప్రతిపాదన మేర నిర్ణయాలు తీసుకోవటం మన కర్తవ్యమని చెప్పారు. చిన్న చిన్న విభేదాలను పక్కనబెట్టి ఐకమత్యంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రమంతా ఒకే రోజు పండుగలు నిర్వహించుకునేలా పంచాగాన్ని రూపొందించాలని చెప్పారు.
కార్యక్రమంలో వేదశాస్త్ర పండితుడు పురాణం మహేశ్వరశర్మ, జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ సాగి కమలాకరశర్మ, వేదశాస్త్ర పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ దోర్భల ప్రభాకరశర్మ, శ్రీమాన్ సంపత్కుమార కృష్ణమాచార్య, శృంగేరిపీఠం ఆస్థాన జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ డాక్టక్ శంకరమంచి రామకృష్ణశర్మ, బ్రహ్మశ్రీ అష్టకాల రామ్మోహన్శర్మ, బ్రహ్మశ్రీ జగన్మోహనశర్మ, యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి దేవస్థాన ప్రధాన పురోహితుడు బ్రహ్మశ్రీ గౌరీభట్ల సత్యనారాయణశర్మ, బ్రహ్మశ్రీ మరుమాముల(దర్శనం) వెంకటరమణశర్మ, యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణశాస్త్రి, బ్రహ్మశ్రీ బోర్పట్ల హనుమంతచారి, బ్రహ్మశ్రీ పండరి సంతోష్కుమార్శర్మ, డాక్టర్ మోత్కూరు సత్యనారాయణశాస్త్రి, వేదపండితులు, అన్ని జిల్లాల అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు.
మాసం | తిథులు | తేది | వారం | పండగ |
చైత్రమాసం | పాడ్యమి | 02-04-2022 | శనివారం | ఉగాది(సంవత్సరాది), వసంత నవరాత్రోత్సవారంభము |
చైత్రమాసం | నవమి | 10-04-2022 | ఆదివారం | సర్వేషాం శ్రీరామనవమి |
చైత్రమాసం | పూర్ణిమ | 16-04-2022 | శనివారం | శ్రీహనుమద్విజయోత్సవం |
వైశాఖమాసం | తదియ | 03-05-2022 | మంగళవారం | పరశురామ జయంతి, అక్షయ తృతీయ, చందనోత్సవం |
వైశాఖమాసం | పూర్ణిమ | 16-05-2022 | సోమవారం | వైశాఖపూర్ణిమ, బుద్ధపూర్ణిమ, అర్థనారీశ్వరవ్రతం, సంపద్గౌరీవ్రతం, శ్రీఅన్నమాచార్య జయంతి |
వైశాఖమాసం | దశమి | 25-05-2022 | బుధవారం | శ్రీ హనుమాన్ జయంతి, రోహిణీకార్తె |
ఆషాడమాసం | విదియ | 01-07-2022 | శుక్రవారం | పూరీజగన్నాథ రథయాత్ర |
ఆషాడమాసం | ఏకాదశి | 10-07-2022 | ఆదివారం | సర్వేషాం తొలిఏకాదశి, చాతుర్మాస్యవ్రతారంభము |
శ్రావణమాసం | పూర్ణిమ | 12-08-2022 | శుక్రవారం | శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణమ, యజుర్వేద ఉపాకర్మ |
శ్రావణమాసం | అష్ఠమి | 19-08-2022 | శుక్రవారం | స్మార్తానం శ్రీకృష్ణాష్టమి |
భాద్రపదమాసం | తదియ | 30-08-2022 | మంగళవారం | షోడశోమా, హరితాళికావ్రతాలు |
భాద్రపదమాసం | చవితి | 31-08-2022 | బుధవారం | వినాయకచతుర్థి |
భాద్రపదమాసం | పంచమి | 01-09-2022 | గురువారం | ఋషిపంచమి |
భాద్రపదమాసం | చతుర్ధశి | 09-09-2022 | శుక్రవారం | అనంతవ్రతం |
భాద్రపదమాసం | అమావాస్య | 25-09-2022 | ఆదివారం | మహాలయ అమావాస్య, విశ్వకర్మ జయంతి |
ఆశ్వీయుజమాసం | సప్తమి | 02-10-2022 | ఆదివారం | శ్రీసరస్వతి పూజ, త్రిరాత్రకలశస్థాపన, భానుసప్తమి |
ఆశ్వీయుజమాసం | అష్టమి | 03-10-2022 | సోమవారం | దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ |
ఆశ్వీయుజమాసం | నవమి | 04-10-2022 | మంగళవారం | మహర్నవమి, హూమబలిదానాలు |
ఆశ్వీయుజమాసం | దశమి | 05-10-2022 | బుధవారం | విజయదశమి, రాజ్ఙాంపట్టాభిషేకం |
ఆశ్వీయుజమాసం | చతుర్దిశి | 24-10-2022 | సోమవారం | తెల్లవారితే సోమవారం అనగా హారతులు, దీపావళి, ధనలక్ష్మీ పూజలు |
మార్గశిరమాసం | షష్టి | 29-11-2022 | మంగళవారం | శ్రీసుబ్రహ్మణ్యషష్టి |
మార్గశిరమాసం | చతుర్దశి | 07-12-2022 | బుధవారం | శ్రీదత్తాత్రేయ జయంతి |
పుష్యమాసం | సప్తమి | 14-01-2023 | శనివారం | భోగి పండుగ |
పుష్యమాసం | అష్టమి | 15-01-2023 | ఆదివారం | మకర సంక్రమణం, సంక్రాంతి, ఉత్తర పుణ్యకాలం |
పుష్యమాసం | నవమి | 16-01-2023 | సోమవారం | కనుమ పండుగ |
మాఘమాసం | పంచమి | 26-01-2023 | గురువారం | శ్రీపంచమి, వసంతపంచమి, గణతంత్ర దినోత్సవం |
మాఘమాసం | సప్తమి | 28-01-2023 | శనివారం | రథసప్తమి |
మాఘమాసం | త్రయోదశి | 18-02-2023 | శనివారం | మహాశివరాత్రి, శనిత్రయోదశి |
ఫాల్గుణమాసం | త్రయోదశి | 05-03-2023 | ఆదివారం | కామదహనం |
ఫాల్గుణమాసం | పూర్ణిమ | 07-03-2023 | మంగళవారం | హోలీ పండుగ |
తేది 13-04-2022, చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం నుండి సార్ధ్రత్రికోటి సహిత ప్రాణహిత(ప్రణీతా)నదీ పుష్కరారంభము
తేది 15-09-2022, భాద్రపద బహుళ పంచమి నుండి తేది 02-12-2022 మార్గశిర శుద్ధనవమి వరకు శుక్రమౌఢ్యము