కాంట్రాక్టర్ల బిల్లుల విడుదలకు కమీషన్.. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలకు కమీషన్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలకు కమీషన్.. మొత్తంగా కమీషన్ ఇస్తేనే ఏ పనైనా అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. కమీషన్ లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడంలేదనే ఆరోపణలున్నాయి.
ఇప్పుడీ జాబితాలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా చేరాయని చెప్పుకొంటున్నారు. ‘30% కమీషన్ ఇచ్చుకో.. రీయింబర్స్మెంట్ బకాయిలు పుచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందని కాలేజీ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఐదేండ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే, దీంట్లో మూడేండ్లు కాంగ్రెస్ సర్కార్‌కు చెందినవే. అయితే బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినట్లు కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నది. అది పూర్తిగా అవాస్తవమన్న వాదనలున్నాయి. 2014కు ముందు కాంగ్రెస్ సర్కార్ నుంచి రూ.1,880కోట్ల బకాయిలు వారసత్వంగా వచ్చాయి. అప్పటి నుంచి ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా ఇబ్బందులు పీడించాయి.
ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. 2023-24, 2024-25, 2025-26 విద్యాసంవత్సరాల్లో రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో బకాయిల మొత్తం విలువ రూ.11, 400 కోట్లకు చేరింది. 30శాతం కమీషన్ పేరిట మొత్తంగా రూ. 3వేల కోట్లకు పైగా దండుకునేందుకు సర్కార్ పెద్దలు టెండర్ వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు 30% కమీషన్ ఇవ్వాలని కొందరు సర్కార్ పెద్దలు డిమాండ్ చేశారని కాలేజీ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవలే కొందరు సర్కార్ పెద్దలు పలు కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారని, రూ.వంద కోట్లకుపైగా బకాయిలున్న బడా కాలేజీలతో బేరసారాలకు దిగారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్కార్ పెద్దలు ముఖ్యంగా న్యాక్, ఎన్బీఏ గుర్తింపు ఉన్న కాలేజీలను టార్గెట్ చేశారని, 30% కమీషన్ ఇస్తేనే బకాయిలు విడుదల అవుతాయని, లేదంటే రూపాయి ఇవ్వబోమని చెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బేరాల వెనుక ముఖ్యనేత హస్తం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రతిపాదనను కాలేజీలు తిరస్కరించాయని చెప్తున్నారు. ‘మాకు న్యాయంగా రావాల్సిన వాటికి కమీషన్ దేనికి? పైగా మావి ట్రస్టు కాలేజీలు. రూపాయి ఇచ్చుకోలేం’ అని ప్రభుత్వ పెద్దల ముఖంపైనే యాజమాన్యాలు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గ్రేటర్‌కు పశ్చిమాన గల ఓ రెండు ప్రముఖ విద్యాసంస్థలకు భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉన్నది. ఓ కాలేజీకి రూ.272 కోట్లు, మరో కాలేజీకి రూ.260 కోట్ల చొప్పున రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ బకాయిల కోసం 30% కమీషన్ ఇచ్చుకోవాలంటూ సర్కార్ పెద్దలు బేరం పెట్టారని చర్చించుకుంటున్నారు. తమవి ట్రస్టు కాలేజీలని, కమీషన్ రూపంలో రూపాయి కూడా ఇవ్వలేమని, ప్రభుత్వం బకాయిలు విడుదల చేసినప్పుడే తీసుకుంటామని స్పష్టంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీకి రూ.140 కోట్లు, హైదరాబాద్ జిల్లాలోని ప్రముఖ కాలేజీకి రూ.238 కోట్ల చొప్పున బకాయిలు విడుదల కావాల్సి ఉన్నది. ఇలా ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయలు సర్కార్ నుంచి రావాల్సి ఉండటంతో ఆయా కాలేజీలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. కొన్ని కాలేజీలు ఫ్యాకల్టీకి 50% జీతాలే ఇస్తున్నాయి. బకాయిల విడుదల కోసం కాలేజీ యాజమాన్యాలు 2025లో ఏకంగా నిరవధిక సమ్మెకు దిగాయి. దీంతో దసరాకు రూ.600, సంక్రాంతికి రూ.300 కోట్ల చొప్పున మాత్రమే బకాయిలు విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో రూ.50 లక్షల్లోపు ఉన్న బకాయిలను మాత్రమే విడుదల చేశారు. దీంతో ప్రముఖ కాలేజీలకు నిరాశే ఎదురైంది. మొత్తంగా వ్యూహాత్మకంగా, ప్రణాళిక ప్రకారం సర్కార్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, కాలేజీలు విసిగి వేసారిపోయాక, ఇప్పుడు కమీషన్ అనే అస్ర్తాన్ని బయటికి తీసిందని, మొత్తంగా కమీషన్ల కోసమే బకాయిలు పెండింగ్‌లో పెట్టారని కాలేజీల యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కార్ విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు కోర్టుబాట పడుతున్నాయి. పాత బకాయిలు విడుదలకాకపోవడం, మళ్లీ కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తుండటంతో యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్తున్నాయి. ఇప్పటికే 14 కాలేజీలు కోర్టును ఆశ్రయించగా, ఈ కేసు ఈ నెల 30కి వాయిదాపడింది. ఇదే కేసులో 100కు పైగా కాలేజీలో ఇంప్లీడ్ అయ్యారు. అయితే, సర్కార్ బకాయిలు విడుదల చేయకపోతే తమకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకొనే వెసులుబాటు కల్పించాలని కాలేజీలు కోర్టును అభ్యర్థించాయి. హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించింది. ఈ నెల 30న కేసు విచారణకు రానుండటం, ఎలాగూ కోర్టు తీర్పుతో ఎంతోకొంత ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంటుంది. అంతకుముందే కమీషన్లు పుచ్చుకుని, ఎంతోకొంత విడుదల చేస్తే, స్వామి కార్యం.. స్వకార్యం రెండూ పూర్తవుతాయన్న భావనతో కొందరు పెద్దలు కమీషన్ల దందాకు తెరలేపారనే ప్రచారం జరుగుతున్నది.