హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): సితార సినిమాలో హీరో శరత్‌బాబు పరిస్థితిలా నేడు రాష్ట్రంలోని కాలేజీ యాజమాన్యాల పరిస్థితి దారుణంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభివర్ణించారు. ఆ సినిమాలో హీరోకు కారు ఉంటుందని, జేబులో మాత్రం ఖర్చుకు రూ.50 కూడా ఉండని దుస్థితిలా.. కాంగ్రెస్ హయాంలో కాలేజీ యాజమాన్యాల పరిస్థితి చేరిందని వివరించారు. అసెంబ్లీలో శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు, సమస్యలను పల్లా లేవనెత్తారు. 2014లో ప్రభుత్వం మారినప్పుడు రూ.1,508 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించిందని తెలిపారు.
ఆ తర్వాత ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కోసం రూ.2,300 కోట్ల నుంచి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారని, మొత్తం పదేండ్లలో రూ.18,900 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, వాటిని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరాయని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలు సగానికిపైగా మూతదశకు చేరాయని తెలిపారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి దశలవారీగానైనా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గ్రీన్‌చానల్ ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు: సీపీఐ, బీజేపీ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తుందో స్పష్టం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సమస్యలపై వారు మాట్లాడారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని తెలిపారు. మొత్తం బకాయిలను ఈ ఏడాదే క్లియర్ చేయాలని కోరారు.
కాంగ్రెస్ బురదజల్లే యత్నం: హరీశ్‌రావు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,000 కోట్ల బకాయిలు పెట్టి పోయిందని, వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని ఉదహరించారు. కరోనా, పెద్దనోట్ల రద్దు వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఏడాదికి సగటున రూ.2 వేల కోట్లకు తగ్గకుండా ఫీజులు చెల్లించామని చెప్పారు. ఏటా ప్రణాళికాబద్ధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేవాళ్లమని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధులను విడుదల చేయడం లేదని, ఇప్పటివరకు చెల్లించిన రూ.800 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ల నిధులేనని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.2,000 కోట్ల పీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతుభరోసాతోనే చెల్లించకలేక పోతున్నాం: మంత్రి సీతక్క
రైతుభరోసా, రుణమాఫీతో ప్రభుత్వంపై భారం పడిందని, అందుకే బిల్లులను చెల్లించలేకపోతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క బదులిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కేవలం రూ.5,520.60 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇప్పటివరకు 829.12 కోట్లు చెల్లించామని, 1,200 కోట్ల చెల్లింపునకు టోకెన్లు జారీచేసినా, వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. విడతల వారీగా బిల్లులను చెల్లిస్తామని, విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదన్నారు. యాజమాన్యాలతో మాట్లాడామని, ఎవరి సర్టిఫికెట్లను ఆపొద్దని స్పష్టంగా చెప్పినట్టు సీతక్క తెలిపారు.