వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఓ విద్యార్థి పాలిటెక్నిక్ పూర్తిచేశాడు. రెండేండ్లపాటు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. చివరి ఏడాది రూ.20 వేల వరకు విడుదల కావాల్సి ఉన్నది. దీంతో కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సదరు విద్యార్థి పాలిటెక్నిక్ పూర్తిచేసినా ఉన్నత విద్యకు దూరమయ్యాడు. అప్పోసప్పు చేసి ఫీజు కట్టినా, ఉన్నత విద్యకు మళ్లీ ఫీజు చెల్లించే స్థోమత లేదని ఆ నిరుపేద విద్యార్థి ఆవేదన. రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు అతను ఎదురుచూస్తున్నాడు.
హైదరాబాద్, నవంబర్15 (నమస్తే తెలంగాణ): ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు బకాయిలన్నింటినీ చెల్లిస్తాం’ ఇదీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వన్‌టైం సెటిల్మెంట్ చేస్తామంటూ మాట మార్చింది. ఆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ప్రకటించారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా అడుగువేసిందే లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు.
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లను మూడు నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దాని ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివరలో మరో 25 శాతం చెల్లించాల్సి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం అది పాటించడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఆయా కళాశాలలకు ప్రభుత్వం ఏడాది క్రితం టోకెన్లను జారీ చేసినా ఇంతవరకూ ఆ నిధులనూ విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఒక్క ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులే దాదాపు రూ.5,900 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని తెలుస్తున్నది. 2024-25 విద్యాసంవత్సరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోతాయని అధికారులు అంచనా వేస్తున్నాను.
ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే అనేక మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకొస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లోనూ చేరుతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం ఇటీవల రూ.1,502 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీచేసింది. కానీ ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ చేయలేదు. ఆ నిధులను ఏ మేరకు వినియోగించాలనే అంశంపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. యాజమాన్యాలు ఒకవైపు బకాయిల కోసం వెంట పడుతుండగా, మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఆ బకాయిల చెల్లింపులకు వినియోగించాలా? లేదంటే ఈ ఏడాది అడ్మిషన్ పొందుతున్న విద్యార్థుల కోసం మంజూరు చేయాలా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని అధికారులు వాపోతున్నారు.
కాచిగూడ, నవంబర్ 15: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్పులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా తరగతులు బహిష్కరించి, జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలనూ ముట్టడించాలని చెప్పారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల స్కాలర్‌షిప్పులను రూ.5 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ కాదని, ముందు విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న గురుకులాలను సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కార్యక్రమంలో నీలం వెంకటేశ్, అనంతయ్య, రాజేందర్, నందగోపాల్, రాందేవ్, ఉదయ్, వీరన్న, ఏ రామకృష్ణ, రవికుమార్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.