హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం త్వరగా చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిధుల విడుదల కోసం 29న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించాలని విద్యార్థులకు, బీసీ సంఘాలకు పిలుపు ఇచ్చారు. బీసీ విద్యార్థులతో ఆయన సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16, 75,000 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాల్సి ఉందని, రూ. 4వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్చేశారు. కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లిస్తున్న సరారు విద్యార్థుల సాలర్షిప్లకు బడ్జెట్ లేదని చెబుతుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోకుండా చేసే కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. బకాయిల విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 29న కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడించాలని ఆర్ కృష్ణయ్య పిలుపు ఇచ్చారు.