ఖమ్మం: చరిత్రలో నిలిచిపోయే విధంగా ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జిల్లా కేంద్రం మొత్తం గులాభీ మయంగా మారింది. ఎటూ చూసిన స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపించాయి. ఉదయమే సభా ప్రాంగణానికి చేరుకున్న అభిమానులు, మహిళలు ‘బీఆర్ఎస్’ అనే ఆంగ్ల అక్షరాలతో కూడిన థర్మాకోల్ షీట్లను ప్రదర్శిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.
భద్రత మరింత కట్టుదిట్టం..
సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాక సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం వద్ద కొందరు ఎమ్మెల్యేలు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు తమ వాహనాలతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలిపివేశారు.సభలో ఎవరు అస్వస్థతకు గురైనా, ఏదైనా అనారోగ్యం సంభవించినా వెనువెంటనే స్పందించేందుకు సభా ప్రాంగణంలో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సిద్ధంగా ఉంచారు.
సభ విజయవంతానికి సర్వమత ప్రార్థనలు..
బీఆర్ఎస్ తొలి సభ విజయవంతం కావాలని, పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరుతూ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఖమ్మంలో సర్వమత ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణ దేవాలయం, సాయిబాబా ఆలయం, క్రీస్తు మందిరాల్లో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన వారిలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడి రాజీవ్‌సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.
గులాబీ జెండా చేతపట్టి..
బీఆర్ఎస్ సభ కోసం బుధవారం ఉదయమే గ్రామాల నుంచి పయనమయ్యారు. గులాబీ జెండా చేతపట్టి, బీఆర్ఎస్ కండువా మెడలో ధరించి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. ‘బండెనక బండికట్టి..’ అన్నట్లుగా తరలివచ్చారు. బీఆర్ఎస్ సభకు లంబాడీ మహిళలూ కదిలి వచ్చారు. పదుల సంఖ్యలో పయనమైన గిరిజన మహిళలు నెత్తిన బిందెలు ఎత్తుకొని డీజే శబ్దాల మధ్య సంప్రదాయ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. కొణిజర్ల మండలం సూర్యాతండా గిరిజన మహిళలు చేసిన నృత్యం ఆకట్టుకుంది.
వైరా సరిహద్దు ప్రాంతం నుంచి సభా ప్రాంగణం వరకూ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కనుచూపు మేరలో ఎక్కడా చూసినా వాహనాల వరుసలే కన్పించాయి. గులాబీ జెండాలతో కూడిన వాహనాలు ఒకదానివెంట మరొకటి చొప్పున వందల సంఖ్యలో ఖమ్మం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి.