దాచేస్తే దాగదు సత్యం.. మూసేస్తే మారదు మోసం.. కేంద్ర మంత్రి గోయల్ మాటలెన్నైనా చెప్పొచ్చు.. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డి మభ్యపెట్టొచ్చు. గత మూడు మాసాలుగా బీజేపీ నేతలంతా లెక్కలు, ఎక్కాలు వల్లెవేస్తూ వచ్చారు. పార్లమెంటులో.. మీడియా సమావేశాల్లో.. తనను కలిసిన రాష్ట్ర మంత్రులతో తెగ మాట్లాడేశారు. ఢిల్లీకి మంత్రులు అధికారులు వెళ్తే.. పనిలేక వచ్చారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందునుంచి చెప్తున్న మాటే నిజమైంది. పంజాబ్లో గంపగుత్తగా మొత్తం ధాన్యం కొంటున్న కేంద్రం తెలంగాణలో కొనడం లేదన్న మన వాదనను సోమవారం భారత ఆహార సంస్థ స్వయంగా బలపరచింది.
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): ధాన్యం సేకరణలో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వ వివక్ష విస్పష్టంగా తేలిపోయింది. దీనికి నిదర్శనమే సోమవారం భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) విడుదల చేసిన ప్రకటన. దేశంలో వరి సాగుచేస్తున్న ఇతర రాష్ర్టాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం చేసిందనేందుకు 2021-22 వానకాలం సీజన్లో ఎఫ్సీఐ ధాన్యం కొనుగోళ్లపై విడుదలచేసిన గణాంకాలు అద్దం పడుతున్నాయి. సాగు విస్తీర్ణం, దిగుబడి తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉన్న పంజాబ్ రాష్ట్రం పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసిన కేంద్రం.. తెలంగాణలో పండించిన వరి ధాన్యంలో 40% మాత్రమే కొన్నది. అదికూడా వానకాలంలో పండిన ధాన్యమే. యాసంగి ధాన్యం కూడా కలుపుకొంటే.. ఈ శాతం మరింతగా తగ్గిపోతుంది. గత వానకాలంలో (2021-22) పంజాబ్లో 72.5 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా.. 190 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దీంట్లో కేంద్రం 186.85 లక్షల టన్నులు (98%) కొనుగోలు చేసింది. తెలంగాణలో వానకాలం 63 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 130 లక్షల టన్ను ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో నుంచి ఎఫ్సీఐ 40 శాతం అంటే.. 52.88 లక్షల టన్నులు కొనుగోలుచేసింది. గతేడాది యాసంగిలో 21.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 92 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. గతేడాది యాసంగి ధాన్యాన్ని కొన్న ఎఫ్సీఐ.. ఈ యాసంగిలో ఒక్క గింజనుకూడా కొనేది లేదంటూ భీష్మించింది.
వానకాలం సీజన్లో 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు
2021-22 వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల వరి సేకరించినట్టు భారత ఆహార సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు అత్యధికంగా పంజాబ్లో 186,85,532 మెట్రిక్ టన్నులు సేకరించినట్టు వెల్లడించింది. పంజాబ్లో ఎంఎస్పీ ద్వారా 47.03 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 7,67,587 మెట్రిక్ టన్నులు సేకరించగా 98,972 మంది రైతులు లబ్ధిపొందారు. ఇందుకు రూ.1504.47 కోట్లు వెచ్చించింది. తెలంగాణలో 52,88,206 మెట్రిక్ టన్నులు సేకరించారు. దాదాపు 7,84,368 మంది రైతులు లబ్ధిపొందారు. వీటి విలువ రూ.10,364 కోట్లుగా ఉన్నట్టు ఎఫ్సీఐ ప్రకటించింది.