Kamareddy | కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాసేపట్లో కూతురి పెళ్లి జరుగుతుందనగా.. మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాలచంద్రం (58) కొంతకాలం కిందట కామారెడ్డిలో స్థిరపడ్డాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కనకమహాలక్ష్మీకి బెంగళూరుకు చెందిన రాఘవేంద్రతో జరిపించాలని ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు జంగంపల్లి శివారులోని బీటీఎస్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాలులో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు బంధుమిత్రులంతా హాజరయ్యారు.
పెళ్లితంతులో వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న సమయంలో బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే బాలచంద్రంను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటివరకు కళకళలాడిన పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇవాళే ఆ తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. కూతురి పెళ్లి చూడటానికి వచ్చిన వారంతా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందర్నీ కలిచివేసింది.