Medchal | మేడ్చల్, ఆగస్టు 11: రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది. కళ్లెదుటే భర్త, ఇద్దరు కూతుళ్లు తునాతునకలు కావడంతో ఆ ఇల్లాలి రోదనకు అంతులేకుండాపోయింది. మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వేస్టేషన్లో జరిగిన ఈ ఘటన రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ పట్టణానికి చెందిన కృష్ణ(38) రైల్వే ఉద్యోగి. ఆయన గౌడవెల్లి రైల్వేస్టేషన్లో కీమాన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తన భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు వర్షిత(11), వరిణి (5)ని తీసుకొని గౌడవెల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. కృష్ణ రైల్వే ట్రాక్‌పై పనిచేస్తుండగా భార్యాబిడ్డలు ప్లాట్‌ఫాంపై ఉన్నారు.
కొద్దిసేపటి తర్వాత కృష్ణ ఒక ట్రాక్‌లో పనిచేస్తుండగా ఇద్దరు బిడ్డలు మరో ట్రాక్‌లోకి ఆడుకునేందుకు వచ్చారు. అదేసమయంలో నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ గౌడవెల్లికి చేరువగా వచ్చింది. తాము ఉన్న ట్రాక్ పైనుంచే రైలు వస్తున్నట్టు పిల్లలు గర్తించలేదు. కృష్ణ కూడా పనిలోపడి దగ్గరికి వచ్చేదాకా గుర్తించలేదు. రైలు సమీపిస్తున్న సమయంలో గుర్తించి వేగంగా కదిలి పిల్లలను ట్రాక్ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నంలో రెప్పపాటులో ముగ్గుర్నీ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిల్లల చేతులు, కాళ్లు తెగిపడగా, కృష్ణ ముఖం, అవయవాలు చితికిపోయి గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాడు. ఈ ఘటన ప్లాట్‌ఫాంపై ఉన్న కవిత కళ్లెదుటే జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.