రామాయంపేట, డిసెంబర్ 3 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లో సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సర్పంచ్ అభ్యర్థిగా మొదటి రోజునే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. రామకిష్టయ్యపై పోటీచేసేందుకు సొంత కొడుకు మానెగల్ల వెంకటేశ్ మంగళవారం నామినేషన్ వేశారు. వీరిద్దరు కాకుండా మరో 8 మంది బరిలో ఉన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఈ నెల 10లోపు తమ సహాయ నిధుల నివేదికలు, ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలు, ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. తమ పూర్తి, పాక్షిక ఆర్థిక నివేదికలను నిర్ణీత గడువులోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఈ నివేదికలను న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపతామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ఆర్థిక పారదర్శకత కోసం సమర్పించాలని భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్టు వెల్లడించారు.