ఇచ్చోడ, మార్చి 30: ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి’ అంటూ ఉగాది పర్వదినాన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతుబంధు లేక, రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
కేసీఆర్ పాలనలో టింగ్ టింగ్ అంటూ పంట పెట్టుబడికి రైతుబంధు వచ్చేదని అన్నారు. వానకాలం రైతుబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని, రుణమాఫీ కూడా అందరికీ చేయలేదని, అందుకే కేసీఆర్ వస్తేనే పంటకు పెట్టుబడి సాయం సమయానికి వస్తదని వారు పేర్కొన్నారు. కేసీఆర్ వస్తేనే తమ బతుకులు మారుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు పాల్గొన్నారు.