CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయిందని, ఏడాదిలోనే అ ద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవా ల్లో సీఎం పాల్గొన్నారు. 213 కొత్త అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక ప త్రాలు అందించారు.16 నర్సింగ్ కాలేజీ లు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలు, 32 మిత్ర ట్రాన్స్ క్లినిక్‌లను వ ర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలో కి రాగానే వైద్య, ఆరోగ్య శాఖలో 7,750 మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతామని తెలిపారు. మరో పదేండ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, బోనస్ కొనసాగిస్తుందని చెప్పారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం: దామోదర
ప్రజలు అనారోగ్యంతో అప్పులపాలు కాకూడదన్నదే తమ లక్ష్యమని, విద్య, వైద్యం వంటి కనీస వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. రాష్ట్రంలో మరో నాలు గు క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పా టు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారులు కేకే, వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
స్పీచ్‌కు ముందే వెళ్లిపోయిన వైద్యులు
ఆరోగ్య ఉత్సవాల పేరిట తీసుకొచ్చి మంత్రులు రాజకీయ ప్రసంగాలు చేయడంపై సభకు వచ్చిన వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతుండగా వారు మధ్యలోనే వెళ్లిపోయారు. డాక్టర్ల గ్యాలరీ ఖాళీగా మారడంతో అధికారులు కంగారుపడ్డారు. సీఎం ప్రసంగం ప్రారంభానికి ముందే గ్యాలరీని నింపేందుకు అందర్నీ బతిమాలి తీసుకురావాల్సి వచ్చింది.
పాత నోటిఫికేషనే
సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందజేసిన 24 మంది ఫుడ్ ఆఫీసర్ పోస్టులకు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 జూలై 21న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే ఏడాది నవంబర్ 7న రాత పరీక్ష నిర్వహించారు. న్యాయపరమైన సమస్యల కారణంగా మిగతా ప్రక్రియ ఆగిపోయింది.