వనపర్తి, మే 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు. రామన్‌పాడ్ డ్యామ్ బ్యాక్ వాటర్ ఆధారంగా ఇక్కడ వరి అధికంగా సాగవుతున్నది. ఎప్పటిలాగే ఈ యాసంగిలో 868 ఎకరాల్లో నాట్లు వేయగా, సుమారు 17,360 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు అంచనా. ఈ సీజన్లో ప్రభుత్వ విక్రయాలను పరిశీలిస్తే.. విస్తుపోవాల్సిందే. ఐదారేండ్లుగా ఎప్పుడూ లేనివిధంగా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు.
ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో పడిగాపులు, కష్టాలను భరించలేక ఊరు.. ఊరంతా ప్రైవేట్బాటపట్టారు. కొత్తపల్లిలో గత ఏప్రిల్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేవలం 36 మంది రైతుల ద్వారా కేవలం 2,420 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొన్నది. ఇక మిగితా 130 మంది రైతులు దాదాపు 14,940 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు. ఇక గ్రామంలో కొనుగోళ్లు ముగిసినట్లేనని రైతులు చెప్తున్నారు. ఈ లెక్కన సర్కార్ కొనుగోళ్ల వ్యవహారం ఎలా సాగుతున్నదో? ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. కొత్తపల్లిలో పండిన ధాన్యంలో పావు భాగం కూడా సర్కార్ కొనకపోవడం విచారకరం.
ఇన్నేండ్లలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది రాలే. ఏటా వరినే పండిస్తున్నం. ఇప్పుడు కూడా 78 సంచుల (65 కిలోలు) సన్న వరి పండింది. క్వింటాల్‌కు 2,200 ధరకు అమ్మినం. సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటరులో అన్నీ సమస్యలే. అందుకే ఊర్లో ఎక్కువ మంది రైతులు వ్యాపారులకే అమ్మిండ్రు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో గోస పడలేక బయట అమ్ముకున్నం. ధర తక్కువైనా సరే వ్యాపారులకే విక్రయించినం. పంట బాగా వచ్చింది. కానీ అమ్మడానికి రైతులు చాలా కష్టపడాల్సి వస్తున్నది.
– బత్తుల మాసన్న, రైతు, కొత్తపల్లి, మదనాపురం మండలం, వనపర్తి జిల్లా
సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కొర్రీలు ఎక్కువయ్యాయి. రైతులను పట్టించుకోరు. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. బస్తాలు ఉండవు. మిల్లుల సమస్యలు, భారీగా తరుగు తీస్తుండ్రు. ఎవరూ చెప్పేటోళ్లు లేరు. ఇవన్నీ చూసి బయటి వ్యాపారులకు ఇచ్చినం. క్వింటా రూ.2,200 ధరకు అమ్ముకున్నం. ఈ యేడాది చాలా సమస్య ఉన్నది. యాసంగిలో బోనస్ కూడా ఇస్తలేరని సర్కార్‌కు అమ్మలే.
– బండారి మాసన్న, రైతు, కొత్తపల్లి, మదనాపురం మండలం,వనపర్తి జిల్లా