నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడానికి శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి, చిన్నచింతకుంట రైతులు అడ్డుకున్నారు. రైతులు సర్వేచేసే ప్రాంతంలో బైఠాయించారు.
ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పోలీస్, సీఆర్పీ బలగాలతో రావడంతో రెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ధర కట్టించి భూసేకరణ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుతిరిగారు.
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామ మహిళలు శనివారం మంచి నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నదని, మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని వారు మండిపడ్డారు. పంప్‌హౌస్ వద్దకు చేరుకొని తాళం వేసి అక్కడి నుంచి దేవరకద్ర నుంచి ఆత్మకూరు వెళ్లే రహదారిపై బైఠాయించారు.
– దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట)
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. బోధన్, ఆర్మూర్‌లోని ఆర్డీవో ఆఫీసుల ఎదుట అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐపీకేఎస్ నాయకులు బైఠాయించారు.
– శక్కర్‌నగర్
వీధి దీపాలు బిగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు శనివారం పంచాయతీ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. లైట్లు లేక రాత్రి వేళ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వీధి దీపాలపై అడిగితే బడ్జెట్ లేదని సమాధానమిస్తున్నారని వారు మండిపడ్డారు.
– రుద్రూర్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చి.. మరోపేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై శనివారం జనగామలో ఆర్యవైశ్య సంఘాలు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల నేతలు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్నరీతిలో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకుడు హరిశ్చంద్రగుప్త మాట్లాడుతూ.. 40 ఏండ్ల క్రితం నామకరణం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
– జనగామ