హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ) : ప్రాంతీయ రింగురోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు పోరును మరింత తీవ్రం చేశారు. ఊర్లకు ఊర్లు ఏకమవుతూ అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించడమే కాకుండా భూసేకరణకు నిర్ధారించిన హద్దులు కూడా చెరిపేస్తూ భూములు ఇవ్వబోమని సంకల్పించారు. దీంతో ఏం చేయాలో తోచక సర్కార్ త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి రైతులకు నచ్చజెప్పాలని భావిస్తున్నది.
ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగాన్ని సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రిభువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 161.518కి.మీల వరకు నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2024 డిసెంబర్ 27న ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించి 2025 ఫిబ్రవరి 14 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది. గడువు పూర్తై ఏడాది కావస్తున్నా ఇంకా టెండర్లు తెరువలేదు. రూ.7,104.06 కోట్ల అంచనా వ్యయం తో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఐదు ప్యాకేజీలుగా పనులు చేపట్టి రెండేండ్లలో రహదారిని సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కోసం 1,950 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా, 95% వరకు పూర్తయినట్టు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా నష్టపరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకోలేదు. ప్రభుత్వ ధర ప్రకారం భూసేకరణకు రూ.5,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా కాగా, బహిరంగమార్కెట్ ధరల ప్రకారం ఇందుకు నాలుగైదు రెట్లు అధికంగా చెల్లించా ల్సి ఉంటుంది. భూసేకరణ నష్టపరిహారం ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించా ల్సి ఉన్నది. భూసేకరణకు వ్యతిరేకంగా కొంద రు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వివాదం కోర్టులో కొనసాగుతున్నది.
నోటిఫికేషన్ ద్వారా భూసేకరణ చేశామని చెబుతున్న భూముల రైతులతోపాటు ఇంకా చేపట్టాల్సిన గ్రామాల ప్రజలు ఏకమై ఇప్పుడు సర్కార్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్, సదాశివపేట్, హత్నూర, దౌల్తాబాద్, మెదక్ జిల్లాలో నర్సాపూర్, కౌడిపల్లె, తూప్రాన్, మాసాయిపేట, సిద్దిపేట జిల్లాలో రాయపోల్, గజ్వేల్, వర్గల్, యాదాద్రి భువనగిరి జిల్లా గందమల్ల, భువనగిరి, రాయగిరి, వలిగొండ తదితర మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు ఉద్యమ కార్యాచరణతో నిత్యం ఏదో ఒక రూపంలో ఆందోళనలు సాగిస్తున్నారు.
పరిహారాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ప్రభుత్వ ధరకు రెట్టింపు చెల్లించేందుకు సర్కా ర్ సిద్ధంకాగా, బహిరంగ మార్కెట్ రేట్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించినవారికి సైతం గరిష్ఠంగా 15-20 లక్షలకు మించి చెల్లించే వీలులేదని స్పష్టంచేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ వెళ్తున్న ప్రాంతాల్లో ఎక్కడా ఎకరా భూమి రూ.50లక్షలకు తక్కువలేదు. ట్రిపుల్ ఆర్ ఏర్పాటైతే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో చెల్లిస్తున్న ధరలే తమకు చెల్లించాలని పట్టుబడుతున్నారు.
ఆయా జిల్లాల్లోని బాధిత రైతులకు అన్ని పార్టీలు అండగా నిలుస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి గతంలో నల్లగొండ ఎంపీగా ఉన్నప్పుడు రైతులకు బాసటగా నిలువగా, ఇప్పుడు భూసేకరణకు మద్దతు ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అధికారులు పరిహారాన్ని లెక్కించేందుకు ఊర్లలోకి వెళ్తుండగా రైతులు అడ్డుకుంటున్నారు. అదే విషయమై అధికారులు ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక సమర్పించారు. గతంలో విడుదలచేసిన నోటిఫికేషన్ ఆధారంగానే నష్ట పరిహారం చెల్లిస్తామని, ఒకవేళ పెంచాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయిస్తే అది పూర్తిగా ప్రభుత్వమే భరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు స్పష్టంచేస్తున్నారు. దీంతో రాష్ట్ర సర్కార్ అయోమయంలో పడింది. రైతులను శాంతపర్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నది.