జగిత్యాల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం రైతు పాదయాత్ర చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాదయాత్రను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ యాత్ర వెంకటాపూర్, మోహన్‌రావుపేట, మేడిపల్లి, తాటిపల్లి, చల్గల్ మీదుగా జగిత్యాలకు చేరుకున్నది. సుమారు 25 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చారు. దారిపొడవునా రైతులు ఉత్సాహంగా కదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ‘రేవంత్ నాటకం.. రుణమాఫీ బూటకం’, ‘మోసానికి కేరాఫ్ కాంగ్రెస్.. దగాకు చిరునామా రేవంత్’ ‘కొర్రీలొద్దు, కోతలొద్దు.. ఆంక్షల్లేని రుణమాఫీ కావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్లకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతించారు. వెంకటాపూర్‌లో రైతులు నాగలిని అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
చల్గల్లో యాత్రకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సాయంత్రం 5గంటలకు జగిత్యాలకు బస్టాండ్‌కు చేరుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపించింది. 25 కిలోమీటర్ల మేర రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనడం, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినదించడం గులాబీదండులో బలాన్ని పెంపొందించింది. మొత్తంగా ఈ రైతు పాదయాత్ర ప్రజల్లో ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని రగిలించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.