Urea | హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద అర్థరాత్రి నుండే యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమానూర్ మండలం వెనిగండ్ల సొసైటీ వద్ద యూరియా కోసం ఉదయం 5.30 గంటల నుంచే రైతులు బారులు తీరారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రాత్రంతా రైతులు అక్కడే నిద్రించారు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని ప్రతి మూలన ప్రతి రోజు చోటు చేసుకుంటున్నాయి. అయినా కూడా అన్నదాతలకు యూరియా దొరకడం లేదు. చాలా చోట్ల అడ్డదారిన యూరియాను మళ్లిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు నిప్పులు చెరుగుతూ.. సీఎం రేవంత్‌తో పాటు ఆయన మంత్రి వర్గాన్ని చీల్చిచెండాడుతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటేయమని తేల్చిచెబుతున్నారు రైతులు.
ఈ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలోనే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు లేకుండే అని గుర్తు చేసుకుంటున్నారు. కంటి నిండా నిద్రపోయే వాళ్లమని, ఇప్పుడు యూరియా కోసం నిద్ర కూడా పోవడం లేదని పేర్కొంటున్నారు రైతులు.