పెద్దపల్లి, జనవరి 30: పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు జరగలేదని, సోమవారం క్వింటాలు పత్తి రూ.7 వేలు ఉండగా, గురువారం రూ.5 వేలకు పడిపోయిందని రైతులు వాపోయారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, ఖరీదుదారులు, అధికారులు రైతులతో చర్చలు జరిపారు.
చర్చ సాగుతుండగానే ఓ అడ్తిలో పత్తి తూకం వేస్తుండడంతో రైతులు కాంటాను ధ్వంసం చేశారు. పత్తి రేటు తగ్గించడంపై మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వూరూపను నిలదీయగా క్వింటాలుకు రూ.50 పెంచేందుకు ఖరీదుదారులు ఒప్పుకున్నట్టు చెప్పారు. క్వింటాలుకు రూ.300 చొప్పున పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. రూ.6500 కంటే ధర తక్కువ పడ్డ రైతులకు రూ.100 చెల్లిస్తామని చైర్పర్సన్ చెప్పడంతో కొంత మంది రైతులు పత్తిని విక్రయించారు.
నేను పదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేసిన. ఇప్పటి వరకు 20 క్వింటాళ్లు అమ్మిన. సోమవారం పెద్దపల్లి మార్కెట్లో 4 క్వింటాళ్లను రూ.7 వేల చొప్పున అమ్మిన. గురువారం 12 క్వింటాళ్ల దాకా తెచ్చిన. క్వింటాలుకు రూ.5 వేలు వేసిన్రు. రెండు రోజుల్లోనే రూ.రెండు వేలు తగ్గింది. గీ రేటు పడితే పెట్టుబడి ఖర్చులు, కూలీలకు సరిపోవు. ఇక కౌలు ఎట్ల కట్టాలె. దండం పెడుతున్న రేటు పెంచండి. లేదంటే అప్పుల పాలయితం.
– రంగు రాజమలు, బోజన్నపేట(పెద్దపల్లి మండలం)
ఈ మార్కెట్లో నాణ్యత, నాసిరకం పత్తికి ఒకే రేటు పడుతున్నది. చుక్క నీరు చల్లకుండా 3 బస్తాల్లో మేలు రకం పత్తిని తెచ్చిన. ఖరీదుదారులు చేతులతో పత్తి పట్టుకొని రేటు వేశారు. క్వింటాలకు రూ.6911 వచ్చింది. రూ.7200 -7300 మధ్య వస్తదనుకున్న. మంచి పత్తి తెచ్చిన రేటు రాలేదు. నాణ్యత, నాసిరకం గుర్తించి రేట్లు వేయాలి.
– గుండాల సమ్మయ్య, బ్రహ్మణపల్లి (పెద్దపల్లి మండలం)
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కుమ్మకై రైతును ముంచుతున్నరు. ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన. ఇప్పటి వరకు 20 క్వింటాళ్లు అమ్మిన. గిట్టుబాటు ధర రాలే. ఈరోజు ఏడు కింటాళ్ల తెచ్చిన క్వింటాలుకు రూ.6 వేలు పలికింది. పెట్టుబడి ఎక్కువై దిగుబడి రాక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ వ్యాపారులు కుమ్మక్కై రైతును ముంచుతున్నరు.
– కలవేన గట్టయ్య, సబ్బితం (పెద్దపల్లి మండలం)