మహబూబాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల కిందట సాగు చేయాలంటే ముందు అప్పు చేయాలి. మిత్తీలకు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. కూలీలకు ఇద్దామంటే పైసలు ఉండేవి కావు. అదను మొదలయ్యాక వానల కోసం ఎదురుచూపులు. వస్తాయో లేదో తెల్వదు. చెరువులు నిండితే పంట పండినట్టు లెక్క. లేకుంటే తెచ్చిన అప్పులు భారమయ్యేవి. అరకొర వర్షాలు వచ్చి పంటలు పండినా మద్దతు ధర అంతంత మాత్రమే. వచ్చిన పైసలు అప్పులు, మిత్తీలకు సరిపోయేవి కావు. మళ్లీ ఇల్లు గడవాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి.
ఈ బాధలు భరించలేని అనేకమంది రైతులు సొంతూర్లను వదిలి పొట్టచేతపట్టుకొని ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన పులిపాటి మోహన్రావుది ఇదే గాథ. అతనికి 2.13 ఎకరాల పొలం ఉన్నది. తెలంగాణ రాకముందు పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసేవారు. వానకాలం, యాసంగి సాగుకు పెట్టుబడి దొరికేది కాదు. అప్పుతో సాగు చేస్తే నీళ్లు లేక పంటలు ఎండిపోయేది. బయ్యారం పెద్ద చెరువు నిండితేనే పంటలు పండేవి. బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి సూరత్‌కు వెళ్లారు. 8 ఏండ్లు సాంచాలు నడిపి జీవనం సాగించారు.
తెలంగాణ ఆవిర్భావం, కేసీఆర్ సీఎం అయ్యాక రైతుల జీవితాల్లో పెనుమార్పులు వచ్చినట్టు తెలుసుకొన్నారు. వలస వెళ్లిన మోహన్‌రావు తిరిగి సొంతూరు కోటగడ్డకు చేరుకొని ఎవుసం ప్రారంభించారు. బయ్యారం చెరువు చూసి మురిసిపోయారు. ఏటా రెండుసార్లు ఇస్తున్న రైతుబంధుతో ఆయనకు పెట్టుబడి కష్టాలు తీరిపోయాయి. వానకాలం, యాసంగి సాగు చేస్తూ అధిక దిగుబడి పొందుతూ సూరత్‌కు వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే దర్జాగా బతుకుతున్నారు.
లాగోడి గోస తప్పింది

రైతుబంధు వచ్చిన తర్వాత లాగోడికి గోస తప్పింది. ఇంతకుమునుపు పంట ఏయాలంటే మిత్తికి పైసలు తెచ్చుకునేటోళ్లం. వాటితో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి కూలోళ్లకు పైసలిచ్చి పనులు కానిచ్చేవారం. పంట పండిన తరువాత మిత్తితో చెల్లించేటోళ్లం. వానలు పడక పండకపోతే లాగోడి అంతా మీద పడి నష్టపోయేవాళ్లం. కేసీఆర్ సీఎం అయినాక రైతుబంధు పథకం తెచ్చి ఎంతో మేలు చేసిండు. పెట్టుబడి కోసం ఎకరానికి ఏటా రూ.10 వేలు అందిస్తుండు. నాకు 7 ఎకరాల పొలం ఉన్నది. ఏటా రూ.70 వేలు పెట్టుబడి సాయం అందుతున్నది. ఈ డబ్బులతో ఎరువులు, విత్తనాలు కొని హాయిగా ఎవుసం చేసుకుంటున్నా.
-పొట్ట నారాయణ, బొంరాస్‌పేట, వికారాబాద్ జిల్లా
రైతుబాంధవుడు కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా రైతుబాంధవుడు. యాసంగి సాగుకు ముందే పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేయడం రైతులకు వరం. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. రైతుబంధు పెట్టుబడిసాయం రూ.10 వేలు బ్యాంకు ఖాతాలో జమైనయి. వ్యవసాయ సాగు నిమిత్తం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశాను. సకాలంలో రైతుబంధు డబ్బులు బ్యాంకులో జమకావడంతో అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతులంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
-అప్పిరెడ్డి, మర్లపాడు, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా
టైంకు పైసలు పడుతున్నయి

వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో పండుగ అయ్యింది. నేను డిగ్రీ వరకు చదువుకొన్నా. వ్యవసాయంపై మక్కువతో 3 ఎకరాల్లో పత్తి, వరి సాగుచేస్తున్నా. గతంల పంట పెట్టుబడికి వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి పంటలు పండించిన. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఐదేండ్లుగా వడ్డీ తిప్పలు తప్పి సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నా. బ్యాంకుల చుట్టూ తిరగడం, వడ్డీ వ్యాపారులను బతిమాలడం లేకుండా పోయింది. దర్జాగా ఖాతాలో పైసలు పడుతున్నయి. రైతులకు ఇంతకన్నా ఇంకేం కావాలి ?
– ఆముదాల రఘుపతిరెడ్డి, చేర్యాల, సిద్దిపేట జిల్లా
అప్పుల బాధ తప్పింది
మాకు 3 ఎకరాలపైన ఉన్నది. యేటా వానకాలం, యాసంగి పంటలకు ముందే పెట్టుబడి సాయంగా రైతుబంధు పైసలు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.17,500 పడ్డయి. ఈ పైసలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు డబ్బులు ఇవ్వడానికి పనికొస్తాయి. సీఎం కేసీఆర్ సారు రైతుల పక్షపాతిగా ఉంటూ, రైతులను అర్థం చేసుకొని పెట్టుబడి ఇస్తున్నాడు. ఇంతకముందు షావుకార్లు, బ్యాంకు వాళ్ల వద్దకు గిరగిర తిరగాల్సి వచ్చేది. అయినా అప్పు పుడుతుందో లేదో తెల్వని దుస్థితి. ఇగ, షావుకార్లయితే మిత్తికి మిత్తి వేసి పైసలు గుంజేది. ఇప్పుడైతే అప్పుల బాధ తప్పింది.
– చుంచు మల్లయ్య, సబితం, పెద్దపల్లి జిల్లా
సాఫ్ట్వేర్ ఉద్యోగంతోపాటు వ్యవసాయం చేస్తున్నా

నేను ఏడాదికి రూ.పది లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. వ్యవసాయ రంగంలో వస్తున్న లాభాలు చూసి, దీన్ని వదలకుండా పనిచేస్తున్నా. వ్యవసాయంపై ఆసక్తి పెరగడానికి కారణం సీఎం కేసీఆర్ రైతులపై చూపుతున్న ప్రేమ. మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూ పెరిగా. మాకు ఎప్పుడూ లాభాలు రాలేదు. ఇంటర్ తర్వాత ఏవియేషన్‌లో డిప్లొమా పూర్తి చేసి, కెనడా బేస్డ్ కంపెనీ టూర్ కన్వెన్షన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. వీకెండ్లో పొలంలో పనిచేస్తున్నా. మా శేఖర్ మామ తిమ్మాపూర్ పొలంలో వరినాట్లు వేస్తున్నా.. సాయం చేయమంటే వచ్చా. ఇప్పుడు వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారిపోయింది. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు అనుకూల కార్యక్రమాలే.
– లింగంపెల్లి వేణు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, రాయికల్, జగిత్యాల జిల్లా
ఎవుసంపై ఆశ పెరిగింది

నాకు ఎకరంన్నర పొలం ఉన్నది. గ్రామ శివారులో చక్కెర ఫ్యాక్టరీ ఉండడంతో అందులో ఉద్యోగం చేస్తున్నా. ఉన్న భూమిని సరిగ్గా పట్టించుకోలె. కేసీఆర్ సారు రైతుబంధు పైసలు ఇచ్చుడు సంది నా మనసు ఎవుసం మీదకు మళ్లింది. ఒక్కో సీజన్ల ఎకరంన్నరకు రూ.7,500 అస్తున్నయ్. ఈ పైసలతోనే నాలుగేండ్ల సంది నా పొలంల నాట్లేయిస్తున్న. యాభై, అరవై బస్తాల అడ్లు అస్తున్నయ్. ఇంటి మందం ఉంచుకుని తతిమయి అమ్మేస్తున్న. ముప్పై వేల దాకా మిగులుతున్నయ్. నాకు మొదట్ల ఎవుసం జెయ్యాలని లేకుండే. కేసీఆర్ సార్ రైతుబంధు ఇచ్చుడుతోనే నా ఆలోచన మారింది. ఇంతకన్న ఏంగావాలె. యాసంగి పైసలు రూ.7500 ఖాతాల పడ్డయ్. ఆ పైసల్తోనే మందు సంచులు కొంటున్న.
-నాగరాజు, మాగి, నిజాంసాగర్ మండలం, కామారెడ్డి జిల్లా
ఫసల్‌కు ముందే పైసలొస్తున్నయ్

నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. గతంల నీళ్లు లేక, పెట్టువడి అందక రెండు మూడెకరాలే సాగు చేసెటోన్ని. ఇపుడు కేసీఆర్ దయతో నీళ్లచ్చినయ్. 24 గంటల కరెంటస్తంది. ఫసల్ మొదలుకాంగనే పెట్టువడికి పైసలస్తన్నయ్. ఇపుడు ప్రతి ఫసల్ల ఆరెకరాలు నాటేస్తన్న. పండిన వడ్లుసుతం ఊళ్లెనే కొంటున్నరు. రైతులకు ఇంతకుముందు ఇసొంటి సదుపాయం ఎవలూ చేయలే. కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి రైతులకు మంచి జరుగుతాంది. ఎకరానికి రూ.5 వేలు ఇచ్చుడంటే మాటలుగాదు. మాసోంటి రైతులెందరో కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటరు.
-జంగిలి మల్లయ్య, కమాన్‌పూర్, కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా
ఏ సర్కారు ఇట్ల ఇయ్యలె
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది వానకాలం, యాసంగి సాగుకు ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేయడం మామూలు విషయం కాదు. ఇంతకుముందు ఏ సర్కారు పంట పెట్టుబడి సాయం చేయలే. నాకు 3 ఎకరాలు ఉన్నది. రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమైంది. పంట సాయం డబ్బును వరికోత, ఎరువులు, విత్తనాలు కొనేందుకు ఉపయోగించా. గతంలో ఇలా ఇచ్చే ప్రభుత్వాలను చూడలేదు. రైతుల మేలు కోరే కేసీఆర్ కొనసాగాలి.
– వెంకటేశ్వరరావు, కందుకూరు, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా
అప్పుల తిప్పలు తప్పింది
నాకు గ్రామంలో పావుదక్వ మూడెకరాల భూమి ఉన్నది. మొదటి పంటగా చిరుధాన్యాలు వేసిన. రెండో పంటగా పత్తి వేసిన. ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినయ్. ఇగ సర్కారోళ్లు ఇస్తున్న పెట్టుబడి సాయం రూ.13,750 ఖాతాలో పడ్డయి. ఈ పైసలతో 10 బస్తాల యూరియా, 4 బస్తాల డీఏపీ, ఇతర మందులు కొనుక్కొస్త. కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలతో పంటకు సరిపడా మందులన్నీ వస్తయ్. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇట్ల సాయం చేయలె. రైతుకు మంచిచేసే నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రెండు సీజన్లకు కలిపి రూ. 27,500 ఇస్తుండ్రు. అప్పులకు తిరిగే తిప్పల తప్పింది. పంటలెట్లననే రంది లేదు. టైంకు అన్ని అందుతున్నయి. కరంటు ఉంటున్నది. పెట్టుబడి సాయం వస్తున్నది.
– ఆత్రం తులసీరాం, ఎల్లూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
దేవునోలె పైసలు ఇస్తుండు
నాకు ఎకరం మూడు గుంటల పొలం ఉన్నది. మునుపు పంట ఎయ్యాల్నంటే బాకీ కోసం ఆసాముల ఇంటికి తిరిగేటోళ్లం. ఇప్పుడు ఆ తిప్పలు పోయినయ్. కేసీఆర్ పైసలు రూ.5,800 బ్యాంకుల జమైనయి. కైకిలోల్లకు, ట్రాక్టర్ కిరాయిలకు, మందులకు లొల్లి లేకుండా పోయింది. పొలం పొతం చేయనికి ఈ పైసల్ ఖర్చు చేస్తా. దేవుడి లెక్క పైసలు ఇస్తున్న సీఎం సారును యాది మరువం. గతంల మస్తు బాధలు పడ్డం. పంట చేతికి అచ్చినంక అడ్లు అమ్మి బాకీలు తీర్చేటోళ్లం. ఇప్పుడట్లా కాదు. అప్పులు జెయ్యాల్సిన పనిలేదు. లాగోడి కోసం పైసల్ అస్తున్నయ్. ఇప్పటిదాంకా మత్తుసార్లు పైసల్ పంపిన సీఎం సారు సల్లగుండాలే. మా అసుంటోళ్లకు గింత మంచిగా సాయం చేసేటోళ్లను దేవుడు మంచిగుంచాలె.
-గడుగు సాయమ్మ, మాదాపూర్, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా