మద్దూర్(కొత్తపల్లి), నవంబర్ 15 : గన్నీ బ్యాగుల కోసం రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం మన్నాపూర్ గేటు వద్ద శనివారం ఆందోళనకు దిగారు. కల్లాల వద్ద ధాన్యం నింపేందుకు గన్నీ బ్యాగులు ఇవ్వాలని రైతు నాగారం నారాయణరెడ్డి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడగ్గా.. కేంద్రానికి తీసుకొస్తేనే అందిస్తామని చెప్పడంతో అసహనం వ్యక్తం చేసిన రైతు మద్దూరు-మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలిపాడు. దీంతో అరగంటసేపు వాహనాలు నిలిచిపోయాయి.
బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పోలీసులు వచ్చి సముదాయించినా వారు వినలేదు. వ్యవసాయ అధికారులు బ్యాగులు ఇస్తామని చెప్పడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.