జన్నారం, ఏప్రిల్ 8 : సాగునీటికోసం రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ వద్ద వరి కంకితో రోడ్డుపై బైఠాయించారు. కడెం 22వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ కింద రాపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు మరో రెండు తడులకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రధాన రోడ్డుపై నిరసన తెలిపారు. నీరందకపోతే దాదాపు 100 ఎకరాల వరకు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కడెం ఉన్నతాధికారులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.