ఆత్మకూర్.ఎస్, మార్చి 24 : వరి పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం కోటినాయక్‌తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై ఎస్సారెస్పీ కాల్వ వద్ద రైతులు పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. మెయిన్ కెనాల్ నుంచి రెండు రోజులు 22ఎల్ కాల్వకు, రెండ్రోజులు 36ఎల్‌కు, రెండ్రోజులు పెన్‌పహాడ్ వైపు నీళ్లు వదలాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టుగా గేట్లు తీసి నీటిని మళ్లించడంలో మిగతా ప్రాంతాల పంట పొలాలు ఎండుతున్నాయని 36ఎల్ కెనాల్ కింది రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సగానికి పైగా పంటలు ఎండిపోయాయని, మిగితా పొలాలు కోత దశకు వచ్చినందున ఈ కొద్దిరోజులైనా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వాలని కోరారు. 36ఎల్ కెనాల్‌కు నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదని, కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని నినదించారు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటంతో ఏఈ సురేశ్ క్రేన్ ద్వారా 36ఎల్ కాల్వ గేట్లను ఎత్తి మెయిన్ కెనాల్ గేట్లను మూసివేశారు.