మహబూబాబాద్ రూరల్, జూన్ 18 : రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానుకోటను అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలబెట్టామని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు.
అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. వాటి అమలులో ఘోర వైఫల్యం చెందారని విమర్శించారు. జూనియర్ కళాశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని రేవంత్‌రెడ్డి.. బ డా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, రంగారావు, తేళ్ల శ్రీను, లునావత్ అశోక్ నాయక్, రావుల రవిచందర్ రెడ్డి పాల్గొన్నారు.