ఆదిలాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారనున్నది. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయాబీన్, మక్క యాసంగిలో జొన్న, శనగ పంటలు సాగు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పత్తిని సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నది. పంటను దిగుబడుల్లో కేవలం 25 శాతాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండగా మిగతా పంటను కేంద్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది.
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పంటను సేకరిస్తారు. జిల్లాలో గతేడాది వానకాలంలో రైతులు పండించిన సోయాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు. యాసంగిలో పండించిన శనగను సగం వరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం అర్ధాంతరంగా కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. దీంతో రైతులు శనగ పంటను సైతం ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మక్క, జొన్న పంటలకు కేవలం మద్దతు ధర ప్రకటిస్తుందే తప్ప కొనుగోలు చేయదు. రెండు పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు యాసంగిలో 1.12 లక్షల ఎకరాల్లో జొన్న సాగుచేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ.270 కోట్లు విలువచేసే 7.30 లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా, రూ.52 కోట్ల విలువ చేసే 2.20 లక్షల మక్క పంటను సేకరించారు. మక్క పంట మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.1,500 కొనుగోలు చేశారు. జొన్న మద్దతు ధర రూ.3,669 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.2,200కే సేకరించారు. ప్రైవేట్‌లో తక్కువ ధర ఉండటంతో రైతులు ప్రభుత్వ కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందారు. జిల్లాలో రైతులు యాసంగిలో రెండు పంటలు మాత్రమే పండిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఈ పంటలను కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పంటలు కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు 1.60 లక్షల ఎకరాల్లో మక్క, జొన్న పండిస్తారు. ప్రైవేట్‌లో తక్కువ ధరకు విక్రయిస్తే రైతులకు పెట్టుబడులు సైతం రాని పరిస్థితులున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు యాసంగి పంటలు వేయాలా? మానుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు. పంటను కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రైతులు పండించిన పంటలను కొనాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. పంటలను కొనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదు. ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారనున్నది. ప్రకృతి వైపరీత్యాలు, లక్షల రూపాయల పంట పెట్టుబడులతో కష్టపడి సాగుచేసిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం విచారకరం. పంటల కొనుగోలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిపోయి కొనబోమంటూ చేతులెత్తేయడం వారి చేతకానితనానికి నిదర్శనం. జిల్లాలో రెండు సీజన్లకు కలిపి రూ.500 కోట్ల విలువచేసే మక్క, జొన్న పంటలను రైతులు పండిస్తారు. సర్కార్ నిర్ణయంతో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
– సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు